Begin typing your search above and press return to search.

మోడీకి చుక్క‌లు చూపిస్తున్న కోకాకోలా

By:  Tupaki Desk   |   28 Nov 2015 4:32 PM GMT
మోడీకి చుక్క‌లు చూపిస్తున్న కోకాకోలా
X
ప్ర‌పంచ దేశాల‌కు ఆప్తుడు, ప్ర‌పంచ పెద్ద‌న్న అయిన అమెరికాకు ప్రియుడు అయిన‌ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఇపుడు కొత్త చిక్కు వ‌చ్చిప‌డింది. అంత‌ర్జాతీయ శీత‌ల పానియాల‌ దిగ్గ‌జం కోకాకోలా వ‌ల్ల ఇపుడు మోడీకి కాకా పుడుతోంది. కోకా కోలా అంటే ప‌ర్యావ‌ర‌ణ విధ్వంసం కార‌క‌మైన ఉత్ప‌త్తి కంపెనీ అనే సంగ‌తి తెలిసిన‌ప్ప‌టికీ ఇపుడు మోడీ సొంత నియోజ‌క‌వ‌ర్గం వారణాసిలోనే కోకాకోలా కార‌ణంగా మోడీ చిక్కుల్లో ప‌డ్డారు.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం మెహ్దీతంజ్ మండలంలోని సుమారు 18 గ్రామ పంచాయితీల్లో తీవ్ర నీటికొర‌త త‌లెత్తుతోంది.వివ‌రాలు ఆరాతీస్తే 1991లో స్థానికంగా నెలకొల్పిన కోకా కోలా కంపెనీ ప్లాంట్ మూలంగానే తమకు మంచినీళ్ల కరువు వచ్చిందని గ్రామస్తులకు తేలింది. ఎందుకైనా మంచిద‌ని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ కు ఫిర్యాదు చేయ‌గా...ఆయా గ్రామాల్లోని నీటివనరుల పరిమితి క్రమేపీ క్షీణిస్తున్న మాట వాస్తవమేనని నివేదిక సమర్పించింది. దీంతో కోకాకోలా కంపెనీ ఏర్పాటు చేయ‌డం, కంపెనీ అవ‌స‌రాల కోసం విప‌రీతంగా భూగర్భజలాలు తోడేయ‌టం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని గ్రామాస్తులు మండిపడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతుండ‌టం వ‌ల్ల త‌మ‌కు అనేక స‌మ‌స్య‌లు ఎదురవుతున్నాయని అందుకే ఇక్కడినుంచి ఆ కోకా కోలా బాట్లింగ్ ప్లాంట్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న‌కు దిగారు. అంతేకాదు కోకా కోలా కంపెనీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి కూడా ఫిర్యాదు చేశారు.

మోడీకి చెందిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఈ ఆందోళ‌న దేశ‌వ్యాప్తంగా మీడియా చూపును త‌న‌వైపు తిప్పుకొంది. గ్రామస్తులు ఆందోళనకు స్థానిక‌ అధికారులు సహా, కాలిఫోర్నియాకు చెందిన భారత సంత‌తికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మద్దుతుగా నిలిచింది. నీటివనరులను కోకాకోలా కంపెనీ కొల్లగొడుతోందని వాదిస్తూ వారికి మ‌ద్ద‌తు ప‌లికింది. దీని మూలంగా ఆయా గ్రామాల్లోని మహిళలు, పిల్లలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంద‌ని పేర్కొంటూ ప్లాంట్‌ను ఎత్తివేయాల‌ని డిమాండ్ చేయ‌డం స‌బ‌బేన‌ని వారంతా పేర్కొంటున్నారు. అయితే వీరి ఆరోపణలను య‌థావిధిగా కోకా కోలా కంపెనీ ఖండించింది. నీటి వ‌న‌రుల క్షీణ‌త‌కు తాము కార‌ణం కాద‌ని ప్ర‌క‌టించింది. అంత‌ర్జాతీయ సంస్థ కావ‌డం...మోడీ సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇపుడీ ఈ ఆందోళ‌న హాట్ టాపిక్ అయి కూర్చుంది.