Begin typing your search above and press return to search.

ఏటీఎంల శుభ‌వార్త‌...లంచ‌గొండుల‌కు చెక్‌

By:  Tupaki Desk   |   2 Dec 2016 9:48 AM GMT
ఏటీఎంల శుభ‌వార్త‌...లంచ‌గొండుల‌కు చెక్‌
X
పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఏటీఎంల చిక్కుల‌కు కాస్తంత ప‌రిష్కారం దొరికింది కొత్త రూ.500 - రూ.2000 నోట్ల పరిమాణానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా రెండు లక్షల ఏటీఎంలకు గాను ఇప్పటివరకు 1.80 లక్షల (90 శాతం) ఏటీఎంల సామర్థ్యం పెంచామని ఏటీఎం తయారీ సంస్థ ఎన్సీఆర్ కార్పొరేషన్ ఎండీ నవ్రోజ్ దస్తర్ తెలిపారు. ఏటీఎంల సామర్థ్యం పెంపునకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ ఎస్ ముంద్రా నేతృత్వంలో గతనెల 14న ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్.. ఎన్సీఆర్ - డైబోల్డ్ నిక్స్‌డర్ వంటి ఏటీఎం తయారీ సంస్థల ప్రతినిధులతో వర్కింగ్ గ్రూప్‌ ను ఏర్పాటు చేసింది. ఈ వర్కింగ్ గ్రూప్ కింద ప్రతిరోజూ సుమారు 60 మంది సిబ్బంది సగటున 12 వేల ఏటీఎంల సామర్థ్యాన్ని పెంచారు. వచ్చే పది రోజుల్లో మిగతా ఏటీఎంల సామర్థ్యం పెంపొందిస్తామని దస్తర్ తెలిపారు.

ఇదిలాఉండ‌గా లంచ గొండుల‌కు చెక్ పెట్టేందుకు అనూహ్య నిర్ణ‌యం వెలువ‌డింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు అవసరమయ్యే వస్తువుల కొనుగోళ్లలో పారదర్శకత పెంపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వస్తువులను అమెజాన్ - ఫ్లిప్‌ కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థల నుంచి నేరుగా ఆన్‌ లైన్‌ లో కొనుగోలు చేయాలని భావిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. సర్కారు వివిధ అవసరాల నిమిత్తం ఏటా పేపర్ క్లిప్పుల నుంచి విద్యుత్ ప్లాంట్ల టర్బైన్ల వరకు కొనుగోలు చేస్తున్నది. ఇందుకు ఏటా రూ. 3 లక్షల కోట్లు వెచ్చిస్తున్నదని అంచనా. ఇది దేశ బడ్జెట్‌ లో దాదాపు 20 శాతం.

ప్రస్తుతం ప్రభుత్వం అన్ని కొనుగోళ్లకు టెండర్ విధానాన్ని పాటిస్తున్నది. ఇందులో భారీగా అవినీతి జరుగుతున్నదని, కొందరు అధికారులు లంచం ఇవ్వనిదే బిల్లులు చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు వస్తువుల నాణ్యతపైనా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ ఆన్‌ లైన్ ద్వారా కొనుగోలు చేస్తే పారదర్శకత పెరగడంతోపాటు, ప్రతీ లావాదేవీపై కనీసం 10 శాతం ఆదా అయ్యే అవకాశం ఉందని సర్కారు భావిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న ఏ సంస్థ అయినా సర్కారుకు బిడ్ దాఖలు చేసే అవకాశం కలుగనుంది. ఫలితంగా తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేయవచ్చన్నది సర్కారు ఆలోచన. ఇక బిల్లుల చెల్లింపుల్లో అవినీతిని తగ్గించడానికి నిబంధనలు మార్పు చేస్తున్నది. బిల్లుల చెల్లింపు గడువును 10 రోజులకు కుదించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/