Begin typing your search above and press return to search.

దొరల బండిలో దొంగల రాణులు..

By:  Tupaki Desk   |   14 Oct 2015 10:53 AM GMT
దొరల బండిలో దొంగల రాణులు..
X
ఢిల్లీ మెట్రో రైళ్లలో జేబుదొంగల బెడద చాలా ఎక్కువగా ఉందట.... అయితే... ఈ దొంగల్లో అధిక శాతం మహిళలే... అధిక శాతం అంటే అలా ఇలా కాదు మొత్తం దొంగల్లో ఏకంగా 93 శాతం ఆడవాళ్లేనట. ఈ ఏడాది ఢిల్లీ మెట్రోల్లో పట్టుకున్న జేబుదొంగల లెక్కలు వేసేసరికి నూటికి 93 మంది మహిళలే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఢిల్లీ మెట్రోలో సీఐఎస్ ఎఫ్ పోలీసులు 195 మంది దొంగలను పట్టుకున్నారు. వారిలో 182 మంది మహిళలు కాగా పురుషులు కేవలం 13 మందే. ఢిల్లీ మెట్రో రైళ్లలో రక్షణ, భద్రత బాధ్యతలు చూస్తున్న సీఐఎస్ ఎఫ్ బలగాలు వీరిని పట్టుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగిస్తున్నాయి. ఢిల్లీ రైళ్లలో మొదటినుంచీ ఆడదొంగలు ఎక్కువేనని.... అయితే, ఇటీవల కాలంలో మరింత ఎక్కువవుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

అయితే.... ఇలా రైళ్లలో దొంగతనాల్లో ఆరితేరిపోయిన ఆడవారిని గుర్తించడం కష్టమేనంటున్నారు పోలీసులు. వారు దొంగలన్న అనుమానం ఏమాత్రం రాకుండా చంటిపిల్లలతో వస్తారని... మెల్లగా జేబుల్లోని పర్సులు - ఒంటిపై ఉండే విలువైన వస్తువులు కొట్టేస్తారని చెబుతున్నారు. ఈ సంగతి తెలిసిన పోలీసులను ప్రయాణికులకు నష్టం కలగకుండా మహిళా, పురుష పోలీసులను మఫ్టీలో కాపలా ఉంచుతున్నారు. వారు ముఖ్యంగా ఆడ దొంగలను గుర్తించి పట్టుకుంటున్నారు. గత ఏడాది కూడా ఏకంగా 300 మంది మహిళా జేబు దొంగలను పోలీసులు పట్టుకున్నారు.