Begin typing your search above and press return to search.

అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం.. 19 మంది దుర్మరణం

By:  Tupaki Desk   |   10 Jan 2022 4:22 AM GMT
అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం.. 19 మంది దుర్మరణం
X
పేద.. ఒక మోస్తరు డెవలప్ అవుతున్న దేశాల్లో అగ్నిప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. నిర్లక్ష్యం.. అప్రమత్తంగా లేకపోవటం.. భద్రతా చర్యల్ని సరిగా పాటించకపోవటం లాంటి కారణాలతో అగ్నిప్రమాదాలు తరచూ చోటు చేసుకోవటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా అమెరికా లాంటి దేశంలో.. న్యూయార్కు లాంటి అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండే మహానగరంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం షాకింగ్ గా మారింది.

గడిచిన ముప్పై ఏళ్లలో ఎప్పుడూ చూడని ఘోరం చోటు చేసుకుందని చెబుతున్నారు. న్యూయార్క్ వెస్ట్ బ్రోంక్స్ లోని 19 అంతస్తుల అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులతోపాటు మొత్తం 19 మంది దుర్మరణం పాలయ్యారు. 60 మందికి పైనే గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేస్తున్నారు.

ఈ ఘోర అగ్నిప్రమాదం గురించి స్పందించిన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్.. గడిచిన ముప్ఫై ఏళ్లలో నగరంలో చోటు చేసుకున్న అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదం ఇదేనన్నారు. అపార్ట్ మెంట్ లోని ప్రతి అంతస్తులోనూ బాధితులు ఉన్నట్లు చెప్పారు. అయితే.. వీరిలో ఎక్కువ మంది అగ్నిప్రమాదం వల్ల చోటు చేసుకున్న పొగను పీల్చి అస్వస్థత పాలయ్యారు.

అగ్నిప్రమాదం మొదటి.. రెండో అంతస్తుల్లో చోటుచేసుకోవటంతో.. మిగిలిన వారు బయటకు రాలేకపోయారు. అమెరికా ఆర్థిక రాజధానిగా పిలిచే న్యూయార్కులో చోటుచేసుకున్న ఈ విషాదం.. నగరంలోని 181 ఈస్ట్ స్ట్రీట్ లో ఉంది. అగ్నిప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. కొద్ది సమయంలోనే 200 ఫైరింజన్లు చేరుకొని.. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

భారీ నిచ్చెనల సాయంతో అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన అపార్ట్ మెంట్లోకి వెళ్లారు. వివిధ ప్లాట్లలో కాలిపోయినట్లు కనిపించిన పలువురిని గుర్తించారు. వారిలో కొందరు అప్పటికే మరణించగా.. మరికొందరు ప్రాణాలతో ఉన్నారు. వారిని.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ భారీ అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు.

అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించటంతో..మంటలు రెండు.. మూడు అంతస్తులకు పరిమితమయ్యేలా చేయగలిగారు.దీంతో.. భారీ ప్రాణ నష్టం తప్పిందని చెప్పాలి. ఈ అపార్ట్ మెంట్ లో 19 మంది మరణించగా.. కాలినగాయాలు.. పొగ పీల్చటంతో మరికొందరు స్ర్పహ కోల్పోయారు. వారికి.. ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.