Begin typing your search above and press return to search.

టెస్లా లోపాల గుట్టు విప్పిన 19 ఏళ్ల డేవిడ్ కొలంబో.. అదెలానంటే?

By:  Tupaki Desk   |   18 Jan 2022 11:31 AM GMT
టెస్లా లోపాల గుట్టు విప్పిన 19 ఏళ్ల డేవిడ్ కొలంబో.. అదెలానంటే?
X
అవును.. ఆ కుర్రాడికి 19 ఏళ్లు. ఇప్పుడు ప్రపంచ కార్ల రంగానికిచెందిన వారంతా ఆ యువకుడి గురించి మాట్లాడుకుంటున్నారు. టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ గా చెప్పే టెస్లా కార్లలోని లోపాల్ని ఎత్తి చూపటమే కాదు.. ఇన్నేసి లోపాలు ఉండటమా? అని ప్రశ్నించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేను మంచోడ్ని కనుక.. నేను కనిపించిన లోపాల్ని చెబుతున్నా. ఒకవేళ.. వీటినే ఎవరైనా చెడ్డవారికి దొరికితే పరిస్థితి ఏమిటి? అంటూ అతను ప్రశ్నిస్తున్న వైనం ఇప్పుడు నిర్ఘాంతపోయేలా చేస్తోంది. ఇంతకీ ఈ టీనేజ్ సంచలనం ఎవరు? ఏం చేస్తుంటారు? ఎక్కడ ఉంటారు? అన్న విషయంలోకి వెళితే..

జర్మనీకి చెందిన ఈ కుర్రాడి పేరు డేవిడ్ కొలంబో. సైబర్ సెక్యురిటీ నిపుణుడు. ఒక ఫ్రెంచ్ కంపెనీకి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహిస్తున్న సమయంలో ఒక కీలకమైన లోపాన్ని గుర్తించారు. కంపెనీ నెట్ వర్కులోని ఒక సాఫ్ట్ వేర్ ద్వారా కంపెనీకి చెందిన ఒక కీలక అధికారి వాడుతున్న టెస్లా కారు వివరాలు బయటకు వచ్చాయి. అంతేకాదు.. సదరు వ్యక్తి కారును ఏ టైంలో ఉపయోగించారు? ఏ సమయంలో ఎక్కడ ఉంది? లాంటి వివరాలు బయటకు వచ్చాయి. దీంతో.. ఆశ్చర్యానికి గురైన ఈ కుర్రాడు మరింత లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు.

అందులో సక్సెస్ అయి.. ఇదే ప్రోగ్రాంమీద నడుస్తున్న ఇతర టెస్లా కార్ల యజమానులకు కొన్ని కమాండ్స్ ను విజయవంతంగా పంపగలిగాడు. అతడు పంపిన కమాండ్స్.. వేరే దేశానికి చెందిన వారు కూడా ఉండటం గమనార్హం. అంతేకాదు.. కారులోని కొన్ని ఫంక్షన్లను ఆన్ లైన్ ద్వారా హైజాక్ చేయటంతోపాటు.. కార్ల డోర్లను మూయటం.. తెరవటంతో పాటు.. హారన్ మోగించటం లాంటివి చేయగలిగాడు. కొంతలో కొంత ఉపశమనం కలిగించే అంశం ఏమైనా ఉందంటే.. స్టీరింగ్.. బ్రేక్ తదితర ఆపరేషన్లను మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో.. తాను సేకరించిన వివరాల్ని టెస్లాకు పంపాడు. కానీ.. దీని గురించి టెస్లా బయటకు మాట్లాడలేదు. అయితే.. తనకు పర్సనల్ గా మొయిల్ పంపినట్లు పేర్కొన్నాడు.

తాను వేర్వేరు దేశాలకు చెందిన 20 కార్లను నియంత్రించినట్లుగా పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని.. స్ర్కీన్ షాట్లతో సహా వెల్లడించాడు. సదరు కార్ల యజమానుల అనుమతి తీసుకొని.. తాను గుర్తించిన విషయాల్ని వారికి చెప్పి.. హారన్ మోగించటం లాంటివి చేయటం ద్వారా.. తాను చెప్పేవి ఎంత నిజమన్న విషయాన్ని తెలిసేలా చేశారు. టెక్నాలజీ అద్భుతంగా చెప్పే టెస్లాలోని సాంకేతిక లోపాలు బయటకు రావటం ఇదేం మొదటిసారి కాదు. ఇప్పటికే చాలాసార్లు గుర్తించారు. 2015లోనూ కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. డేవిడ్ కొలంబో బయటపెట్టిన వివరాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. మరి.. దీనిపై టెస్లా అధినేత ఎలా రియాక్టు అవుతారో?