Begin typing your search above and press return to search.

మీరు చదివేది కరెక్టే..అబ్బాయి మీద అమ్మాయి యాసిడ్ దాడి

By:  Tupaki Desk   |   26 Oct 2019 9:28 AM GMT
మీరు చదివేది కరెక్టే..అబ్బాయి మీద అమ్మాయి యాసిడ్ దాడి
X
కాలం మారింది. దానికి తగ్గట్లే.. క్రైం కూడా మారుతోంది. ఒకప్పుడు పగ అంటే శత్రువులన్నట్లు ఉండేది. ఇప్పుడు భార్య మీద భర్త.. భర్త మీద భార్య.. తండ్రి మీద కొడుకు.. కొడుకు మీద తండ్రి.. ప్రియురాలి మీద ప్రియుడు.. ఇలా అత్యంత సన్నిహిత సంబంధాలు.. రక్త సంబంధాల మధ్య హత్యా నేరాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఇంతకాలం అమ్మాయిల మీద యాసిడ్ దాడి వార్తలు చాలానే చదివి ఉన్నాం. ఇప్పుడు అందుకు భిన్నంగా చోటు చేసుకున్న క్రైం షాకింగ్ గా మారింది.

తనను మోసం చేశాడని భావించిన ఒక అమ్మాయి.. ఒక యువకుడి మీద యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో గాయపడ్డ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాసిడ్ దాడికి పాల్పడిన అమ్మాయి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ చేసుకున్నదంటే.. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. జీవన్ గఢ్ కు చెందిన ఫైజద్ అనే 20 ఏళ్ల కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు. వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

అయితే.. వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అతను నెల రోజులుగా మాట్లాడటం మానేశాడు. దీంతో కోపానికి గురైన ఆ యువతి ఎందుకిలా చేస్తున్నావంటూ అతడ్ని నిలదీయగా.. అతను సమాధానం చెప్పలేదు. ఇంతకాలం సన్నిహితంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవటానికి ఇబ్బంది ఏమిటని గొడవ పడింది. దీనికి ఫైజద్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ అమ్మాయి.. తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను అతడి మీద పోసింది. ఊహించని పరిణామానికి గురైన ఫైజద్ షాక్ తిన్నాడు. యాసిడ్ దాడిలో అతను తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో అతనికి చికిత్స చేస్తున్నారు. దాడికి పాల్పడిన అమ్మాయితో తన కొడుక్కి సంబంధం ఉందని.. వారిద్దరూ కొన్నాళ్లుగా మాట్లాడుకోవటం లేదని బాధిత యువకుడి తల్లి వాపోయింది. యాసిడ్ దాడికి పాల్పడిన యువతి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.