Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ ఇంట దీపాన్ని నిలిపిన పోస్ట‌ర్ బాయ్

By:  Tupaki Desk   |   11 Oct 2017 5:51 AM GMT
చిన్న‌మ్మ ఇంట దీపాన్ని నిలిపిన పోస్ట‌ర్ బాయ్
X
పోస్ట‌ర్ అతికిస్తూ బ‌తికేసే సాదాసీదా కుర్రాడు ఇప్పుడు త‌మిళ‌నాడులో హాట్ టాపిక్ అయ్యారు. రాజ‌కీయ పార్టీల పోస్ట‌ర్లు అతికిస్తూ పొట్ట‌బోసుకునే ఒక కుర్రాడు తమిళ‌నాడు రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క‌మైన చిన్న‌మ్మకు ప్రాణ‌దానం చేశాడు.

నెచ్చెలి మ‌ర‌ణించిన స‌మ‌యంలోనూ ఉబికి వ‌స్తున్న క‌న్నీటిని అదిమి ప‌ట్టిన శ‌శిక‌ళ‌.. ఆసుప‌త్రిలో త‌న భ‌ర్త న‌ట‌రాజ‌న్‌ను చూసినప్పుడు మాత్రం కంట్రోల్ చేసుకోలేక‌పోయారు. క‌న్నీటితో.. త‌న భ‌ర్త‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాలంటూ డాక్ట‌ర్ల‌ను వేడుకోవ‌టం తెలిసిందే. ఇంత‌కీ.. చిన్న‌మ్మ‌కు పోస్ట‌ర్ బాయ్ ప్రాణ‌దానం చేయ‌టం ఏమిట‌న్న విష‌యంలోకి వెళితే..

కొంత‌కాలంగా శ‌శిక‌ళ భ‌ర్త న‌ట‌రాజ‌న్ ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదు. కొద్ది నెల‌లుగా ఆయ‌న త‌ర‌చూ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురవుతున్నారు. ఆయ‌న లివ‌ర్‌.. కిడ్నీలు పూర్తిగా దెబ్బ తిన‌టం.. వాటిని మార్చాల్సి రావ‌టంతో దాత కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వేళ‌.. 19 ఏళ్ల పోస్ట‌ర్లు అంటించే కుర్రాడి విషాద మ‌ర‌ణం చిన్న‌మ్మ భ‌ర్త ప్రాణాల్ని కాపాడేలా చేసింది. ల‌క్ష‌లాది మంది అనుచ‌ర‌గ‌ణం ఉన్నప్ప‌టికీ ఎవ‌రూ చేయ‌లేనంత సాయం చేసిన పోస్ట‌ర్ బాయ్ పేరు కార్తీక్‌. త‌మిళ‌నాడులోని పుదుకొట‌జిల్లా అరంతాంగి స‌మీపంలోని కూత్తాడివ‌య‌ల్ అనే గ్రామంలో ఉండేవాడు.

రాజ‌కీయ పార్టీల పోస్ట‌ర్ల‌ను అంటించే ప‌ని చేస్తూ.. దాంతో వ‌చ్చే డ‌బ్బుతో పొట్టనింపుకునే వాడు. దిన‌స‌రి కూలీగా ప‌ని చేసే కార్తీక్ సెప్టెంబ‌రు 30న త‌న స్నేహితుడి బైకును న‌డుపుతూ ఒక కారును బ‌లంగా ఢీ కొట్టాడు. దీంతో.. అత‌డి త‌ల‌.. ముఖంపై బ‌ల‌మైన దెబ్బ‌లు త‌గిలాయి. వెంట‌నే కార్తీక్‌ ను ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని గ్లోబ‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రికి చేరేట‌ప్ప‌టికే అత‌డు బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లుగా డాక్ట‌ర్లు గుర్తించారు. తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన బిడ్డ‌కు సంబంధించిన అవ‌యువాల్ని దానం చేస్తే మ‌రికొంద‌రికి జీవితాన్ని ప్ర‌సాదించే అవ‌కాశం ఉంద‌న్న వైద్యుల సూచ‌న‌కు కార్తీక్ త‌ల్లిదండ్రులు స‌రేన‌న్నారు.

దీంతో.. కార్తీక్‌ కు చెందిన లివ‌ర్‌.. కిడ్నీల‌ను న‌ట‌రాజ‌న్ కు అమ‌ర్చారు. ఇక‌..కార్తీక్ గుండెను త‌మిళ‌నాడుకు చెందిన ఒకరికి అమ‌ర్చ‌గా.. ఊపిరితిత్తుల‌ను యూపీకి చెందిన 62 ఏళ్ల వృద్ధునికి అమ‌ర్చిన‌ట్లుగా గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వెల్ల‌డించింది. క‌టిక పేద‌రికంతో ఉన్న కార్తీక్ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని.. అత‌డి సోద‌రికి ఉద్యోగాన్ని ఇవ్వాల‌ని కార్తీక్ బావ కోరుతున్నాడు. చిన్న‌మ్మ‌కు జ‌రిగిన మేలుతో పోలిస్తే.. కార్తీక్ బావ కోరిన కోరిక చిన్న‌దే క‌దూ?