Begin typing your search above and press return to search.

దేశ ప్రజల మీద 13లక్షల కోట్ల అదనపు భారం పడనుందా?

By:  Tupaki Desk   |   25 Aug 2019 8:19 AM GMT
దేశ ప్రజల మీద 13లక్షల కోట్ల అదనపు భారం పడనుందా?
X
ఎవరో చేసిన తప్పునకు మరెవరో మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడనుందా? అంటే.. అవునన్న సంకేతాలు వణుకు తెప్పిస్తున్నాయి. తాజాగా స్టాక్ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు.. అంతర్జాతీయంగా నెలకొన్న మాంద్యంతో పాటు దేశీయంగా చోటు చేసుకున్న పరిణామాలు తిరిగి.. తిరిగి దేశ ప్రజలకు గుదిబండలా మారనున్నాయా? అంటే అవునని చెప్పక తప్పదు. ఆర్థిక వ్యవస్థ అన్న గొలుసులో.. ఎక్కడ చిక్కుముడి పడినా.. గొలుసు మొత్తమ్మీదా ప్రభావం చూపుతుంది.

తాజాగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. కొద్ది నెలలుగా స్టాక్ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల మార్కెట్ క్యాపిటల్ (సాదాసీదా భాషలో చెప్పాలంటే షేరు ధర అనుకోండి. ఉదాహరణకు బత్తాయి అనే కంపెనీ ఉందనుకోండి. ఆ బత్తాయి కంపెనీ షేరు ముఖవిలువ రూ.10 అయితే.. మార్కెట్లో ఆ కంపెనీకి ఉండే పేరు ప్రఖ్యాతులు.. ఇతరత్రా కారణాలతో ఆ షేరు విలువ రూ.1000 పలుకుతోందనుకోండి. రూ.990 మార్కెట్ క్యాపిటల్ గా చెప్పాలి. స్టాక్ మార్కెట్లో నెలకొన్న పరిణామాల కారణంగా దాని ధర అంతకంతకూ తగ్గిపోతుందనుకోండి అప్పటివరకూ దానికున్న సంపద మొత్తం మాయమయ్యే పరిస్థితి) అంతకంతకూ హరించుకుపోతున్నాయి. దీంతో.. పలు సంస్థలకు ఉండే అప్పులు.. వాటి మార్కెట్ విలువకంటే తక్కువైపోవటంతో తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్న పరిస్థితి.

గడిచిన ఐదేళ్లలో ఈ తరహాలో పలు కంపెనీల మార్కెట్ క్యాపిటల్ హరించుకుపోయి.. అప్పుల్లోకి కూరుకుపోయి.. దివాల అంచుల్లోకి చేరుకుంటున్న వైనం అంతకంతకూ పెరగటం ఇదే తొలిసారిగా చెప్పాలి. 2018 చివరి నాటికి ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీల సంఖ్య 99 ఉంటే.. ఈ ఏడాది మార్చి నాటికి 147గా చేరాయి. కొద్ది నెలల వ్యవధిలో తాజాగా ఇలాంటి పరిస్థితిలోకి వచ్చిన కంపెనీల సంఖ్య 195కు చేరుకున్నట్లుగా చెబుతున్నారు.

ఇలా నష్టాల్లో కూరుకుపోయి.. దివాల అంచుల్లోకి చేరిన కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన అప్పుల విలువ రూ.13లక్షల కోట్లు కావటం గమనార్హం. అంటే.. కంపెనీలు కానీ మునిగిపోతే.. ఆ వెంటనే దాని ప్రభావం బ్యాంకుల మీద పడుతుంది. బ్యాంకులు ఒకేసారి రూ.13లక్షల కోట్ల మేర నష్టపోతే.. దాని ప్రభావం నేరుగా దేశ ప్రజల మీద పడటం ఖాయం. అదే జరిగితే.. నిధుల కొరతతో పాటు పలు ఆర్థిక సంబంధమైన సమస్యలు తలెత్తటం ఖాయమని చెప్పక తప్పదు.

కంపెనీలు నష్టపోతే దేశ ప్రజలు భరించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న రావొచ్చు. నిజమే.. వాస్తవంగా అయితే కంపెనీల తప్పులకు దేశ ప్రజలు మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ.. కంపెనీలకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు.. సంస్థల దివాల కారణంగా భారీగా నష్టపోతాయి. వాటి నష్టాన్ని ప్రభుత్వం మీద వేసుకుంటుంది. తనకున్న లోటును తీర్చుకోవటానికి ప్రభుత్వాలు అంతిమంగా బాదేది ప్రజల్నే కదా. అలాంటప్పుడు ప్రజలకు కాక మరెవరి మీద భారం పడుతుంది? అందుకే.. ఎక్కడో మనకు సంబంధం లేని కంపెనీలు చేసే అప్పలు కూడా దేశ ప్రజల మీద భారం పడటానికి అవకాశం ఉందని చెప్పక తప్పదు.

ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. మొన్నటి వరకూ హేమాహేమీ కంపెనీలుగా పేరున్న చాలా సంస్థల మార్కెట్ క్యాపిటల్.. వాటి రుణాల నిష్పత్తిని దాటేస్తోంది. అలాంటి వాటిల్లో వొడాఫోన్ ఇండియా.. టాటా మోటార్స్.. టాటా పవర్స్.. టాటా స్టీల్.. జీఎంఆర్ ఇన్ఫ్రా.. ఆర్ బీఐ ఇన్ఫ్రా.. అదానీ పవర్.. జిందాల్ స్టీల్ లాంటి సంస్థలెన్నో ఉన్నాయి. మరి.. ఈ కష్టం నుంచి గట్టెక్కించటానికి ఎలా చర్యల్ని మోడీ సర్కారు తీసుకుంటుందో చూడాలి.