Begin typing your search above and press return to search.

1962 చైనాతో యుద్ధానికి ముందు..తర్వాత భారత్ లో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   23 Jun 2020 3:30 AM GMT
1962 చైనాతో యుద్ధానికి ముందు..తర్వాత భారత్ లో ఏం జరిగింది?
X
భారత్, చైనాల మధ్య ఈ శత్రుత్వం ఎక్కడిది? అసలు ఎలా పుట్టింది. ? దీనికి మూల కారణాలేంటి? హిందీ-చీనీ భాయి భాయి కాస్తా యుద్ధానికి ఎలా దారితీసిందో తెలియాలంటే మీరు స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన పరిణామాలు తెలుసుకోవాల్సిందే. అసలు భారత్ , చైనా మధ్య యుద్ధానికి కారణమైంది ఓ ప్రాంతం.

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం ఇప్పటిదీ కాదు.. అది చెప్పుకోవాలంటే 1959కి వెళ్లాల్సిందే.. చైనాకు వ్యతిరేకంగా టిబెట్ లో మొదలైన గొడవలు.. టిబెట్ మతగురువు దలైలామాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం నుంచి కయ్యం మొదలైంది. ఈ పరిణామం 1962లో భారత్ పైకి చైనా దండెత్తడానికి దోహదపడింది.

1959 నుంచి చైనాకు వ్యతిరేకంగా టిబెట్‌ మొదలైన ఆందోళనలు, దలైలామాకు భారత్‌ ఆశ్రయమివ్వడం వంటి ఘటనలతో భారత్‌పై చైనా అక్కసు పెంచుకుంది. సరిహద్దుల్లో ఘర్షణలు నిత్యకృత్యంగా మారాయి. సరిహద్దు ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అల్లర్లు కాస్తా చొరబాట్లుగా మారాయి. సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్‌చిన్‌ ప్రాంతాల్లో నెలకొన్న వివాదాలు తీవ్రమయ్యాయి తూర్పు సరిహద్దుల్లోని ఈశాన్య భారత్ లోని 135, 148కి.మీ భూభాగంపై భారత అధికారాల్ని చైనా ప్రశ్నించింది. ఇవి కాస్తా ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణలుగా మారడంతో 1962లో వివాదాస్పద మెక్‌మోహన్‌ లైన్‌ను దాటుకుని చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సేనలు భారత్‌లో చొరబడ్డాయి.

1962లో భారత్-చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధానికి రెండేళ్ల ముందే భారతదేశ వ్యాప్తంగా చైనాపై మన దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. 1960లో అప్పటి చైనా ప్రధానమంత్రి చౌఎన్ లై భారత దేశ పర్యటనకు వచ్చారు. నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆయనకు స్వాగతం పలికారు. చైనా ప్రధాని పర్యటనను ఢిల్లీలో ప్రజలు తీవ్ర నిరసనలు తెలిపారు.

ప్రజలు నిరసనలు తెలుపుతుంటే చైనా ప్రధాని మాత్రం దీన్ని తేలిగ్గా తీసిపారేయగా.. నెహ్రూ మాత్రం తీవ్రమైనదిగా పరిగణించారు. సరిహద్దు వివాదాలపై నాడు చౌ-నెహ్రూ చర్చలు జరిపారు. అయినా సానుకూల ఫలితం రాలేదు. తర్వాత కాలంలో ఈ వివాదం మరింత ముదిరింది.

చివరకు 1962 అక్టోబరు 20 పంచశీల సూత్రాలను సమాధి చేసి భారత్‌పై చైనా దండెత్తింది. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి ముందే చైనా కుట్రలపై దేశంలో నిరసనలు సాగాయి. జన్ సంఘ్ పార్టీ ఢిల్లీలో స్కూటర్ ర్యాలీని ప్రజలతో కలిసి నిర్వహించింది.

ఈశాన్య భారత్ లో 1962లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఢిల్లీలో జరిగిన స్వాంత్రత్య వేడుకలపై కూడా ఆ ప్రభావం పడింది. అక్టోబర్ లో యుద్ధం మొదలైంది.చైనా దురాక్రమణకు భారత సైన్యం, నాయకత్వ వైఫల్యాలు కూడా కారణాలే.. రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌.. చైనా నుంచి ఊహించని దాడిని ఎదుర్కొవాల్సి వచ్చింది. ఉపఖండంలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా భారత్‌ను భావించిన చైనా మొదట్లోనే కట్టడి చేయాలని భావించింది. అందుకు దేశ భద్రతపై దార్శనికత కొరవడిన భారత పాలకుల వైఫల్యం కలిసొచ్చింది. కాలం చెల్లిన ఆయుధాలతో ఆధునీకరణ కోసం ఎదురుచూస్తోన్న భారత సైన్యం చైనాతో బలవంతపు యుద్ధానికి దిగాల్సి వచ్చింది. దీనికితోడు చైనా దురాక్రమణ విషయంలో నాటి ప్రధాని నెహ్రూ, రక్షణ మంత్రి కృష్ణ మీనన్‌, సైనిక కమాండర్లు అనుసరించిన వ్యూహాలపై కూడా రకరకాల కథనాలు ప్రచారం ఉన్నాయి. సకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం భారత్‌కు శాపంగా పరిణమించిందని భారత్‌-చైనా యుధ్ధంపై నివేదిక సమర్పించిన జనరల్‌ హెండర్సన్‌-బ్రూక్స్‌, బ్రిగేడియర్‌ పిఎస్‌ల నివేదికల్లో తప్పుపట్టడం కూడా వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది.

యుద్ధం మిగిల్చిన విషాదం జవహర్‌లాల్‌ రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. చైనాతో సోదరభావం నినాదంతో సాగిన విధానాలు విఫలమవడం నెహ్రూకు అంతులేని విషాదాన్ని తెచ్చిపెట్టింది. సైన్యం, ప్రభుత్వ విభాగాల నుంచి పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. యుద్ధంలో అంతులేని సైనిక నష్టానికి దేశం మొత్తం నెహ్రూ, కృష్ణమీనన్‌లను వేలెత్తి చూపించాయి. స్వాతంత్ర్యం వచ్చిన ఒకటిన్నర దశాబ్దాల తర్వాత కూడా సైనిక ఆయుధ సంపత్తిని ఆధునీకరించుకోని వైఫల్యాన్ని ఎండగట్టాయి. హిందీ ఛీనీ భాయి భాయి అంటూ సాగిన భారత విధానాలు ఎందుకు పనికి రావని తేలిపోయాయి. సాక్షాత్తూ భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కూడా యుద్ధానికి సన్నద్దమవడంలో నెహ్రూ నిర్లక్ష్యం వహించారంటూ విమర్శించడం ప్రధానికి మింగుడు పడలేదు. అందుబాటులో ఉన్న వనరుల్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయిందని భారత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సరైన ఎయిర్‌బేస్‌లు లేని చైనాను గగనతలం నుంచి కట్టడి చేసే అవకాశాలను భారత్‌ వినియోగించుకోలేకపోయింది. భారీ సంఖ్యలో ఉన్న చైనా మిలటరీ బలగాలను చూసి భారత్ సైన్యం మనోధైర్యాన్ని కోల్పోయిందని నివేదికలు తేల్చి చెప్పాయి.

యుద్ధం మిగిల్చిన ఓటమితో నాటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్‌ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. రక్షణ శాఖ ఆధునీకరణకు జరగక పోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మీనన్‌ రాజీనామా చేశారు. అదే సమయంలో చైనా యుద్ధం స్ఫూర్తితో జమ్మూ కశ్మీర్‌లో పాక్‌ చొరబాట్లు ప్రారంభించింది. చివరకు అది కాస్త 1965 రెండో కశ్మీర్‌ యుద్ధానికి దారి తీసింది. ఆ తర్వాత ఇండో-పాక్‌ యుద్ధానికి పాక్‌ తెగించడానికి కూడా చైనా చొరబాట్లే ప్రేరకమయ్యాయి. యుద్ధం మిగిశాక కారణాలను అన్వేషించేందుకు ప్రభుత్వం నియమించిన హెండర్సన్‌ బ్రూక్స్‌-భగత్‌ రిపోర్టు లో ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పు పట్టడం నెహ్రూను తీవ్రంగా కుంగ దీసింది. అదే సమయం లో అంతర్జాతీయం గా కూడా భారత్‌ తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ మాత్రం సన్నద్ధత లేని సైన్యం తో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తు లో యుద్ధానికి దిగడం ఆత్మహత్యా సాదృశ్యమని తెలిసి భారత్‌ మొండిగా యుద్ధానికి దిగిందని బ్రిటిష్‌ పత్రికలు విమర్శించాయి. నిజానికి యుద్ధ సమయం లో భారత్‌ అమెరికా వైమానిక సాయాన్ని కోరినా కెన్నడీ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. చైనా చేసిన నమ్మక ద్రోహం, నెహ్రూ విదేశాంగ విధానాల విఫలమవడం పై పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కుంగుబాటుతోనే యుద్ధం జరిగిన రెండేళ్లకు 1964లో నెహ్రూ కన్నుమూశారు.

ఈ యుద్ధంలో భారత్ ఓడిపోవడంతో రాజకీయంగా దేశంలో ప్రకంపనలు మొదలయ్యాయి. నెహ్రూ మరణం తర్వాత ఇందిరాగాంధీకి పీఠం దక్కకుండా లాల్ బహదూర్ శాస్త్రి కాంగ్రెస్ లో చక్రం తిప్పాడు. ప్రధాని అయ్యి మొదట భారత రక్షణ రంగాన్ని నవీకరించాడు. సోవియట్ యూనియన్ తో కలిసి భారత్ సైనిక బలాన్ని పెంచాడు. అత్యాధునిక ఆయుధాలు, యుద్ధసామగ్రిని కొని నెహ్రూ వైఫల్యాలను కవర్ చేశాడు.

ఐదేళ్ల తర్వాత 1967లో నాథులా వద్ద భారత్-చైనా మరోసారి ఢీ అంటే ఢీ అన్నాయి. ఆ యుద్ధంలో భారత సేనలు చైనాసేనలను తరిమికొట్టాయి. విజయం సాధించాయి. చైనా దాడిపై ఢిల్లీలో కూడా హింస చోటుచేసుకుంది. నగరంలోని చైనా రాయబార కార్యాలయంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు.

1962 యుద్ధం తర్వాత ఆడపాదడపా చైనాతో గొడవలు ఘర్షణలు పదుల సంఖ్యలో సైనికుల మరణాలు చోటుచేసుకున్నాయి.2017లో డోక్లాంలో చైనా రోడ్డు నిర్మించేటప్పుడు భారత్ అడ్డుకోవడంతో వివాదం గొడవలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇండియా-చైనాల మధ్య లడఖ్‌లో జరిగిన కాల్పుల్లో 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి యుద్ధ యంత్రాలపై మన వాళ్ల ఫోకస్ పడింది. చరిత్రలో చైనా యుద్ధంలో గొప్ప విజయాలే సాధించి ఉండొచ్చు కానీ, యుద్ధ అనుభవాల్లో ఇండియా తక్కువేం కాదు.

తర్వాత ఈ ఐదు దశాబ్ధాల్లో చైనా-భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడినా.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటుచేసుకున్నాయి. రెండు దేశాలు యుద్ధాలను విరమించినా సరిహద్దుల్లో మాత్రం ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. వీటి ప్రభావం దేశ రాజకీయాల్లో వీధుల్లోనూ కనిపిస్తూనే ఉంది.