Begin typing your search above and press return to search.

కోవాగ్జిన్: 6 కోట్ల డోసుల్లో 2 కోట్లే పంపిణీ?

By:  Tupaki Desk   |   29 May 2021 2:30 AM GMT
కోవాగ్జిన్: 6 కోట్ల డోసుల్లో 2 కోట్లే పంపిణీ?
X
కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్ తో కలిసి భారత్ బయోటెక్ తయారు చేసిన ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్ ఇప్పుడు దేశంలో ఎక్కడా కనిపించడం లేదన్న ఆరోపణలున్నాయి.. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ వేసుకుందామంటే అస్సలు దొరకడం లేదు. దేశంలో భారత్ బయోటెక్ ‘కోవాగ్జిన్’ కొరత తీవ్రంగా ఉందని వినియోగదారులు అంటున్నారు.. ఒక డోసు వేసుకున్న వారికి రెండో డోసు కూడా అందని పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు.

ఇప్పటివరకు భారత్ బయోటెక్ కంపెనీ వెల్లడించిన లెక్కల ప్రకారం.. 6 కోట్ల డోసులు మార్కెట్ లోకి విడుదలయ్యాయి. అయితే ఇప్పటివరకు కేవలం 2.1 కోట్ల మందికి మాత్రమే కోవాగ్జిన్ ను అధికారికంగా వేయడం గమనార్హం. అంటే మిగతా 4 కోట్ల కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఏమయ్యాయన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

18-45 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేస్తామని కేంద్రం ప్రకటించినా వ్యాక్సిన్ కొరతతో ఇప్పటిదాకా అది మొదలు కాలేదు. అందరికీ వ్యాక్సిన్ ఇప్పట్లో సాధ్యం కాదని తేలింది. వ్యాక్సిన్ డోసుల తయారీ, సరఫరాపై అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ సరఫరా ఎటు పోతుందో అర్థం కావడం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో కోవాగ్జిన్ డోసులకు.. కంపెనీ సామర్థ్యానికి అస్సలు పొంత ఉండడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. 6 కోట్ల డోసులు పంపిణీ చేశామని భారత్ బయోటెక్ చెబుతుంటే.. మరో వైపు కేంద్రం మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య కేవలం 2.1 కోట్లు మాత్రమేననడంతో ఈ వివాదం రాజుకుంది.

ఇప్పటికే భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా దీనిపై వివరణ ఇచ్చారు. మార్చి, ఏప్రిల్, మే నెల వరకు మొత్తం 5.5 కోట్ల డోసులు ఉత్పత్తి చేశామని ప్రకటించారు.మరోవైపు కేంద్రప్రభుత్వం మాత్రం కేరళ హైకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. నెలకు 2 కోట్ల డోసుల కోవాగ్జిన్ ఉత్పత్తి అవుతోందని.. మే చివరి నాటికి 5.5 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

నిజానికి వ్యాక్సినేషన్ కు ముందే భారత్ బయోటెక్ వద్ద 20 మిలియన్ డోసులు ఉన్నాయి. దాంతో మొత్తం 7.5 కోట్ల డోసులు. భారత్ ఇప్పటిదాకా 6.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఎగుమతి చేసింది. 2 కోట్ల కోవాగ్జిన్ డోసులు బయట దేశాలకు పంచింది. 6 కోట్ల డోసులు దేశంలో వాడేశారని లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా దేశంలో కోవాగ్జిన్ తీసుకున్న వారి సంఖ్య కేవలం 2.1 కోట్లు మాత్రమే. కోవాగ్జిన్ రెండో డోస్ దేశంలో అందడం లేదని తీసుకున్న ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

దేశంలో కోవాగ్జిన్ తీసుకున్న వారిలో 31శాతం మంది ఢిల్లీలో ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కోవాగ్జిన్ కొరత తీవ్రంగా ఉంది. దేశంలో సుమారు 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అసలు కోవాగ్జిన్ చేరలేదని లెక్క తేలింది. 6 కోట్ల డోసుల్లో 2.1 కోట్లు మాత్రమే వేసుకుంటే మిగిలిన డోసులు ఏమయ్యాయన్నది చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై భారత్ బయోటెక్ స్పందించలేదు. కేంద్రం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.