Begin typing your search above and press return to search.

కళ్యాణమస్తు : ఈ ఏడాది మూడు సార్లు ఒక్కో జంటకు 2 గ్రాముల బంగారం!

By:  Tupaki Desk   |   24 March 2021 11:17 AM GMT
కళ్యాణమస్తు : ఈ ఏడాది మూడు సార్లు ఒక్కో జంటకు 2 గ్రాముల బంగారం!
X
కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమల విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి భక్తులు , ఆ శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. ఇదిలా ఉంటే ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తాజాగా మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు పదేళ్ల క్రితం నిలిచిపోయిన కళ్యాణమస్తు కార్యక్రమానికి టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. ఇందులో భాగంగా పవిత్ర లగ్న పత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలను ఇప్పటికే పూర్తి చేసింది.

ఈ ఏడాది మూడు సార్లు కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా ఒకటయ్యే జంటలకు అందించే తాళిబొట్టును సైతం ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం టీటీడీ ట్రెజరీలో సిద్ధంగా ఉన్న 20 వేల తాళిబొట్లను వినియోగించుకోనుంది. తిరుమల శ్రీవారి సమక్షంలో పేద హిందువులు సామూహికంగా వివాహం చేసుకునేలా 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమం ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో కళ్యాణమస్తును ఘనంగా నిర్వహించేవారు. శ్రీవారి పాదాల చెంత వేలాది జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యేవారు. ఈ సందర్భంగా వధూవరులకు టీటీడీ తరఫున నూతన వస్త్రాలు, బంగారు తాళిబొట్టును అందించడమే కాకుండా, 50 మంది బంధువులకు భోజనాలను కూడా వితరణ చేసేవారు.

2007 నుంచి 2011 వరకు ఏటా రెండు విడతలుగా కల్యాణమస్తును నిర్వహించారు. అయితే, తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం మధ్యలో ఆగిపోయింది. ఈ తరుణంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కళ్యాణమస్తును పునః ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కళ్యాణమస్తును వైభవోపేతంగా నిర్వహించేందుకు టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. మే 28, అక్టోబర్‌ 30, నవంబర్‌ 17వ తేదీల్లో ఘనంగా కళ్యాణమస్తు నిర్వహిస్తామని ఈవో జవహర్‌ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇక వేదికలని నిర్ణయించలేదు.