Begin typing your search above and press return to search.

సంకీర్ణ స‌ర్కారుకు షాక్‌..కూలిపోయే స్థితిలో స‌ర్కారు

By:  Tupaki Desk   |   16 Jan 2019 6:30 AM GMT
సంకీర్ణ స‌ర్కారుకు షాక్‌..కూలిపోయే స్థితిలో స‌ర్కారు
X
సంకీర్ణ స‌ర్కారుతో సాగుతున్న కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరించుకున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ అగ్రనేతలు ఢిల్లీకి తరలించారు. ఈ క్రమంలో కర్ణాటక రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్ నగేశ్ - ఆర్ శంకర్.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలు విడుదల చేశారు. ఈ సందర్భంగా నగేశ్ - శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను ఈ సంకీర్ణ ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. కాంగ్రెస్ - జేడీఎస్ మధ్య సఖ్యత లేదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పని చేయడం లేదన్నారు. తామిద్దరం బీజేపీకి మద్దతిస్తున్నామని తేల్చిచెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, మంగళవారం మధ్యాహ్నానికి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు వస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వరప్ప ఢిల్లీలో ప్రకటించారు.

అయితే, తమ ప్రభుత్వం పడిపోదని కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి చెబుతోంది. క‌ర్ణాట‌క‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర స్పందిస్తూ డబ్బు, అధికార బలంతో బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న బీజేపీ ప్రయత్నాలు విఫలమవుతాయని పేర్కొన్నారు. తమది స్థిరమైన ప్రభుత్వమని.. ప్రభుత్వం పడిపోదని పరమేశ్వర ఉద్ఘాటించారు.

కర్ణాటకలో పార్టీల బలబలాలు..

భారతీయ జనతా పార్టీ నుంచి 104 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, కాంగ్రెస్ 80 - జేడీఎస్ 37 - బీఎస్పీ నుంచి ఒకరు - స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 113.