Begin typing your search above and press return to search.

లిబియాలో తెలుగు ప్రొఫెస‌ర్ల ప‌రిస్థితి ఏంటి?

By:  Tupaki Desk   |   18 Aug 2015 10:07 AM GMT
లిబియాలో తెలుగు ప్రొఫెస‌ర్ల ప‌రిస్థితి ఏంటి?
X
లిబియాలో బందీలుగా ఉన్న ఇద్దరు తెలుగు ప్రొఫెసర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. గత కొన్ని రోజులుగా వీరి ఆచూకీపై ఎలాంటి సమాచారమూ లేకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. లిబియాలో ఉగ్ర‌వాదుల‌ పోరాటం తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో తీవ్ర‌వాదుల చేతుల్లో బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

లిబియాలో ఉగ్రవాద సంస్థ ఐసిస్ బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరామ్ గురించి అధికారిక స‌మాచారం ఏదీ రాక‌పోవ‌డంతో వారి పరిస్థితి అంతు పట్టడం లేదు. లిబియా లోని సిర్తే పట్టణంలో వీరు ఐఎస్ ఐఎస్‌ బందీలుగా ఉన్నట్లు అందిన‌దే చివ‌రి స‌మాచారం. అయితే సిర్తే పై పట్టుకోసం ఐసిస్, ఫర్జాన్ తెగల మధ్య ఇటీవల పోరు తీవ్రమైన నేపథ్యంలో తెలుగు ప్రొఫెసర్ల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

గోపికృష్ణ, బలరామ్ ల‌తో పాటు మరో ఇద్దరు ప్రొఫెసర్లు ట్యూనీషియా వద్ద సరిహద్దులు దాటుతుండగా ఐఎస్‌ ఐఎస్‌ కు పట్టుబడ్డారు. అయితే మిగతా ఇద్దరు ప్రొఫెసర్లు 48 గంటల వ్యవధిలో విడుదల కాగా… గోపికృష్ణ, బలరామ్ ల‌ను మాత్రం ఐఎస్‌ ఐఎస్‌ బందీలుగానే అట్టిపెట్టుకుంది. భారతీయ దౌత్య కార్యాలయం, ప్రొఫెసర్ల వద్ద చదువుకున్న మాజీ విద్యార్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. తెలుగు ప్రొఫెసర్ల ఆచూకీ మాత్రం తెలీడం లేదు. తెలుగు ప్రొఫెసర్లు ఐఎస్‌ ఉగ్రవాదుల బందీలుగా చిక్కిన మొదట్లో భారత ప్రభుత్వం హడావుడి చేసినా.. ఆ తర్వాత వారిని గురించి పట్టించుకోవడం మానేసిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కొందరు మంత్రులు తెలుగు ప్రొఫెసర్లు విడుదలయ్యారంటూ ప్రకటన చేసినా.. వాస్తవానికి అది జరగలేదు. ఈ నేపథ్యంలో రోజులు గడుస్తున్న కొద్దీ తెలుగు ప్రొఫెసర్ల పరిస్థితిపై వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన తీవ్రమవుతోంది.