Begin typing your search above and press return to search.

2 ల‌క్ష‌ల టికెట్లు...అర గంట‌లో ఖాళీ!

By:  Tupaki Desk   |   24 Dec 2022 11:30 PM GMT
2 ల‌క్ష‌ల టికెట్లు...అర గంట‌లో ఖాళీ!
X
క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమల శ్రీవారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు ఏ స్థాయిలో పోటెత్తి వ‌స్తుంటారో అంద‌రికీ తెలిసిందే. తాజాగా స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తుల్లో ఉన్న డిమాండు సాక్షాత్తూ టీటీడీ వ‌ర్గాల‌నే నివ్వెర‌ప‌రిచింది. వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా టీటీడీ విడుద‌ల చేసిన రూ.300 ప్ర‌త్యేక ద‌ర్శ‌నం ఆన్‌లైన్ టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అయిపోవ‌డం చూసి అధికారులు నోరెళ్ల బెట్టారు. ఒక‌టి కాదు రెండు కాదు 2 ల‌క్ష‌ల టికెట్లు కేవ‌లం అర గంట‌లోనే భ‌క్తులు బుక్ చేసుకున్నారు. స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తుల్లో నెల‌కొన్న డిమాండ్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ముక్కోటి ఏకాద‌శి అంటే హిందువుల‌కు ఎంత ప్ర‌శ‌స్త‌మైన‌దో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. ఆ రోజు క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం భ‌క్తులు వ‌రంలా భావిస్తుంటారు. ఆ రోజు శ్రీవారి ఆల‌యంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తారు కాబ‌ట్టి ఆ రోజు స్వామివారిని ద‌ర్శించుకోవ‌డానికి భ‌క్తులు ఉత్సాహ‌ప‌డుతుంటారు.

ఈ ఏడాది వైకుంఠ ఏకాద‌శి జ‌న‌వ‌రి 2వ తేదీ వ‌చ్చింది. దీంతో తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో జ‌న‌వ‌రి జనవరి 2 నుండి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజుల్లో స్వామివారిని ద‌ర్శించుకోవ‌డానికి భ‌క్తులు తిరుమ‌ల‌కు పోటెత్తుతుంటారు. గంట‌ల త‌ర‌బ‌డి బారులు తీరి స్వామి వారిని ద‌ర్శించుకుని పుల‌కించిపోతుంటారు. ఈ వైకుంఠ ఏకాద‌శికి టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.

శ్రీవారి దర్శనం కోసం రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల ఆన్ లైన్ కోటాను శనివారం ఉదయం 9గంటలకు టీటీడీ విడుదల చేసింది. ఆన్ లైన్ లో 10 రోజులుకు 2 లక్షల రూ.300 దర్శనం టికెట్లు విడుదల చేసింది. అయితే ఈ టికెట్ల‌నీ్న కేవ‌లం అర‌గంట‌లోనే అయిపోయాయి. 9.30 త‌రువాత ద‌ర్శ‌నం టికెట్లు ఖాళీ అయ్యాయి.

నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు కూడా తిరుమ‌ల్లో ఏర్పాట్లు ఘ‌నంగా చేప‌ట్టారు. జ‌న‌వ‌రి 1వ తేదీన ఆఫ్‌లైన్ విధానంలో టీటీడీ టోకెన్లు కేటాయించ‌నున్నాను. తిరుప‌తిలో 9 కేంద్రాల ద్వారా రోజుకు 50వేల చొప్పున 5 ల‌క్ష‌ల టోకెన్లు జారీచేయ‌నున్న‌ది టీటీడీ.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.