Begin typing your search above and press return to search.

యువ‌తి ప్రాణం తీసిన వాట్సాప్ మెసేజ్!

By:  Tupaki Desk   |   9 Jan 2018 4:53 PM GMT
యువ‌తి ప్రాణం తీసిన వాట్సాప్ మెసేజ్!
X
వాట్సాప్ లో ఇద్దరు మిత్రుల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ చినికి చినికి గాలివాన‌గా మారి ఓ నిండు ప్రాణం బ‌లైంది. త‌న స్నేహితురాలు చెప్పిన విష‌యాన్ని అనాలోచితంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఓ యువ‌కుడు ఇబ్బందుల‌పాల‌య్యాడు. స్నేహితుడితో త‌న అభిప్రాయాన్ని పంచుకున్న పాపానికి ఓ యువ‌తి ఆత్మ‌హత్య చేసుకుంది. కర్ణాటకలోని చిక్కమగళూరు సమీపంలోని మూడిగెరె ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జరిగింది. ఆదివారం రాత్రి 10గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.స్థానిక క‌ళాశాల‌లో డిగ్రీ చ‌దువుతోన్న ధన్యశ్రీ(20) అనే యువతి ఓ ముస్లిం యువకుడితో స్నేహంగా ఉండేది. ఆమె స్నేహితుడు - భ‌జ‌రంగ్ దళ్ కు చెందిన సంతోష్ అనే యువకుడు.....ఆ ముస్లిం యువ‌కుడితో స్నేహాన్ని మానుకోమని ధన్యశ్రీని వారించాడు. నేను ఒక ముస్లిం యువకుడిని ప్రేమించడం పాపమా ? అంటూ ధ‌న్య‌శ్రీ ప్ర‌శ్నించింది. వీరిద్ద‌రి మ‌ధ్య వాట్సప్ చాటింగ్ లో ఆ చ‌ర్చ తార‌స్థాయికి చేరింది.

హిందువులతో స్నేహంగా ఉండాలని - వారినే పెళ్లి చేసుకోవాలని ధన్యశ్రీకి సంతోష్ చెప్పాడు. లవ్ జీహాద్ ఉచ్చులో పడకూడదని సంతోష్ ధన్యశ్రీకి వార్నింగ్ ఇచ్చాడు. అత‌డి వైఖరి నచ్చక‌పోవ‌డంతో.....‘ఐ లవ్ ముస్లిమ్స్’ అని ముస్లిం యువకుడితో కలిసి దిగిన ఫొటో పెట్టి మరీ ధన్యశ్రీ రిప్లై ఇచ్చింది. దీంతో, కోపోద్రిక్తుడైన సంతోష్ ఆమె రిప్లైని స్క్రీన్‌ షాట్ తీసి సంఘ్ పరివార్ గ్రూపుల్లో షేర్ చేశాడు. అత‌డు షేర్ చేసిన కొద్దిసేప‌టికే ఆ ఫొటో వైర‌ల్ అయింది.

ఈ ఘ‌ట‌న అంత‌టితో స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. ఆ త‌ర్వాత మూడగిరె పట్టణం బీజేపీ యువమోర్చ అధ్యక్షుడు అనీల్ రాజ్ తో పాటు ఐదుగురు వ్య‌క్తులు ధన్యశ్రీ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారు. ముస్లిం యువకుడితో స్నేహం - ప్రేమ ఏమిట‌ని ధన్యశ్రీతో పాటు ఆమె తల్లిని బెదిరించారు.

తాను స్నేహితుడ‌ని న‌మ్మి పంచుకున్న‌ వ్యక్తిగత విషయాలను, ఫోటోలను సంతోష్ సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ధ‌న్య‌శ్రీ మ‌న‌స్తాపానికి గురైందని చిక్కమగళూరు జిల్లా ఎస్పీ అన్నామలై తెలిపారు. భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌లు త‌న‌ను మానసికంగా వేధింపులకు గురి చేశారని సూసైడ్ నోట్ రాసి ధన్యశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురి మీద ఎఫ్ ఐఆర్ నమోదు చేశామ‌ని, అనీల్ రాజ్ ను అరెస్టు చేశామన్నారు. ఆ మెసేజ్ లు, ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో వ్యాప్తిచేసిన వారికోసం గాలిస్తున్నామని, ఈ కేసులో ఎవ్వరినీ వదిలిపెట్టమన్నారు.