Begin typing your search above and press return to search.

200 కార్లతో జైలు నుంచి తీసుకెళ్లారు

By:  Tupaki Desk   |   12 Sep 2016 9:28 AM GMT
200 కార్లతో జైలు నుంచి తీసుకెళ్లారు
X
దేశంలో నేరస్తులకు.. నేరమయ జీవితాలకు అలవాటు పడిన వారికి లభించే ఆదరణ చూస్తే షాక్ తినాల్సిందే. ఒక హత్య కేసులో 13 ఏళ్ల జైలు జీవితాన్ని అనుభవించిన ఒక నేత బయటకు వస్తే అతనికి ఎలాంటి ఆదరణ లభిస్తుంది? అని ఎవరినైనా అడిగితే.. వారు చెప్పే సమాధానానికి బీహార్ లో జరిగిన దానికి ఏ మాత్రం పోలిక ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. బీహార్ అధికారపక్షమైన ఆర్జేడీకి చెందిన కీలక నేతల్లో మహ్మద్ సాహబుద్దీన్ ఎలాంటి నేత అన్నది అందరికి తెలిసిందే. నేరమయ జీవితానికి కేరాఫ్ అడ్రస్ అయిన అతగాడు ఇటీవల హత్య కేసులో శిక్ష అనుభవించి ఇటీవల జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యాడు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న హడావుడి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

సుదీర్ఘకాలం తర్వాత జైలు నుంచి బెయిల్ విడుదల అయినా.. అతగాడి హవా ఏ మాత్రం తగ్గలేదనేలా ఆర్జేడీ నేతలు భారీగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ఏకంగా రెండు వందల కార్లను ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. అంతేనా.. బుగ్గ కారు (మంత్రులు.. క్యాబినెట్ హోదా ఉన్న వారు వాడతారు)లో అతడిని జైలు నుంచి తీసుకెళ్లిన వైనానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. భగల్ పూర్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన సాహబుద్దీన్ కు స్వాగతం పలికేందుకు వందల సంఖ్యలో వచ్చిన అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

జైలు నుంచి ఆయన స్వగ్రామమైన సివాన్ కు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో ముజఫర్ పూర్ టోల్ గేట్ ఉంది. కానీ.. అక్కడ వీరి 200 కార్లతో కూడిన కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోయింది. అన్నేసి వందల కార్లనుటోల్ ఫీజు తీసుకోకుండా ఎలా వెళ్లనిచ్చారన్న అంశంపై దృష్టి పెట్టిన వారికి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. సాహబుద్దీన్ పరివారాన్ని.. ఆయన ప్రయాణిస్తున్న వాహన శ్రేణిని అపొద్దంటూ స్థానిక పోలీసుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాము టోల్ ఫీజు వసూలు చేయలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి బయటకు రావటంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారి.. నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.