Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో మాయ‌మ‌వుతున్న పెద్ద‌నోట్లు!

By:  Tupaki Desk   |   28 Oct 2018 4:41 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో మాయ‌మ‌వుతున్న పెద్ద‌నోట్లు!
X
షాకింగ్ విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. రెండు తెలుగు రాస్ట్రాల్లో భారీ ఎత్తున రూ.2వేల నోట్లు క‌నిపించ‌కుండా పోతున్నాయి. బ్యాంకుల వ‌ద్ద నుంచి క్ర‌మ‌ప‌ద్ద‌తిలో రూ.2వేల నోట్లను రిజ‌ర్వ్ బ్యాంకు విడుద‌ల చేస్తున్నా.. బ‌య‌ట‌కు వ‌చ్చిన రూ.2వేల నోట్ల‌లో స‌గానికి పైనే తిరిగి రొటేష‌న్ లోకి రాని ప‌రిస్థితి నెల‌కొంది.

దీనికి కార‌ణంగా తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో పాటు.. మ‌రికొద్ది నెల‌ల్లో ఏపీలోనూ.. తెలంగాణ‌లోనూ జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్రిప‌రేష‌న్లో భాగంగా రాజ‌కీయ వ‌ర్గాలు పెద్ద నోట్ల‌ను బ్లాక్ చేస్తున్న‌ట్లుగా భావిస్తున్నారు. ఆర్ బీఐ అధికారుల విశ్లేష‌ణ ప్ర‌కారం చూస్తే... పెద్ద నోట్లను బ్లాక్ చేస్తున్న తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోకొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు.

మ‌రో 45 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు.. ఆ త‌ర్వాత మ‌రో ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లతో పాటు పార్ల‌మెంటు ఎన్నిక‌లు.. తెలంగాణ పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ఖ‌ర్చుకు అవ‌స‌ర‌మైన మొత్తాన్ని రూ.2వేల నోట్ల‌ను దాచేస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఆర్ బీఐ వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం రెండు తెలుగు రాష్ట్రాల‌కు విడుద‌ల చేసిన రూ.2వేల నోట్ల విలువ ఏకంగా రూ.53వేల కోట్లు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే సెప్టెంబ‌రు చివ‌రికి రోటేష‌న్ అవుతున్న మొత్తం రూ.25వేల కోట్లేన‌ని.. మిగిలిన రూ.28 వేల కోట్ల విలువైన రెండు వేల రూపాయిల నోట్లు మార్కెట్లోకి రావ‌టం లేద‌ని.. ర‌హ‌స్య ప్ర‌దేశాల‌కు త‌ర‌లి వెళుతున్నాయ‌న్న అనుమానాల్ని వ్య‌క్తం చేస్తున్నారు.ఇలా దాచి పెట్టిన పెద్ద నోట్ల వ‌చ్చే ఏడాది మే త‌ర్వాత నుంచి చెలామ‌ణిలోకి భారీగా రావ‌టం ఖాయ‌మంటున్నారు.

గ‌డిచిన ఏడాదిగా పెద్ద నోట్ల బ‌య‌ట‌కు వెళ్ల‌ట‌మే కానీ తిరిగి ఖ‌జానాకు చేరుతోంది త‌క్కువేన‌ని చెబుతున్నారు.గ‌డిచిన ఆర్నెల్ల‌లో తెలుగు రాష్ట్రాల‌కు ఆర్ బీఐ విడుద‌ల చేసిన రూ.10వేల కోట్ల విలువైన నోట్ల‌ను బ్లాక్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. భారీ ఎత్తున రూ.2వేల నోట్ల మార్కెట్లోకి రాక‌పోవ‌టాన్ని ఆర్ బీఐ గుర్తించింది. ఇదే విష‌యాన్ని కేంద్రానికి విన్న‌వించింది. ఇలా బ్లాక్ అయిన మొత్తాన్ని గుర్తించేందుకు ఈడీ డైరెక్ట‌రేట్‌.. ఐటీ శాఖ‌లు రంగంలోకి దిగి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇంత భారీ మొత్తం బ్లాక్ కావ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.