Begin typing your search above and press return to search.

జూన్ వరకే రూ.2వేల నోటు?

By:  Tupaki Desk   |   30 Nov 2016 3:46 AM GMT
జూన్ వరకే రూ.2వేల నోటు?
X
ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ప్రతి ఒక్క విషయానికి ఉలిక్కిపడే పరిస్థితి. గతంలో ఏదైనా మాట చెవిన పడితే.. సాధ్యం కాదులే అన్న భరోసా ఉండేది. ప్రధాని మోడీ పుణ్యమా అని.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. ఏదైనా.. ఎలాంటి నిర్ణయమైనా మోడీ తీసుకుంటారని గడిచిన రెండున్నరేళ్ల ఆయన పాలన చెప్పకనే చెప్పేసింది. అన్నింటికి మించి.. గడిచిన ఆర్నెల్ల వ్యవధిలో ఆయనిచ్చిన షాకులు మామూలువి కావు.

కలలో కూడా ఊహించని విదంగా పెద్దనోట్ల రద్దును ఒక్క నోటి మాటతో తీసేసిన ఆయన ధైర్యం.. తెగువ చూసిన చాలామందికి.. దేశానికి ఎంతోకొంత మేలు జరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. అది నిజమా? కాదా?అన్నది పక్కన పెడితే.. ఒక ఆశ అయితే అందరిలో ప్రస్తుతం నెలకొని ఉంది.అదే సమయంలో మరో ఇబ్బందికరమైన మైండ్ సెట్ ప్రజల్లోకి వచ్చేసింది. ప్రతి విషయాన్ని నమ్మటమో.. సందేహంగా చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. గతంలో మాదిరి ధీమా లేదు. ఇలాంటి వైఖరితో మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి. నోట్ల రద్దు నేపథ్యంలో బయటకు వచ్చిన రూ.2వేల నోటు మీద వస్తున్న ఊహాగానాలు అన్నిఇన్ని కావు. ఇప్పటివరకూ ఆ నోటు మీద కేంద్రం ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని.. ఆలోచనల్ని వెల్లడించనప్పటికీ.. పలు ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి.

అలాంటి వాటిల్లో ముఖ్యమైనది.. కీలకమైనది రూ.2వేల నోటు ఎక్కువ కాలం ఉండదు అని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రూ.2వేల నోటు భవిష్యత్తులో ఉండదేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. గడిచిన కొద్దిరోజుల్లో ఒకటికి రెండు సార్లు ప్రధాని మోడీని కలిసింది.. ఆయనతో ఎక్కువ సేపు మాట్లాడిన ఎన్డీయేతర ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అంటే అది కేసీఆరే. అలాంటి ఆయన నోటి నుంచి రూ.2వేల నోటు రద్దు మాట రావటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. రూ.2వేల నోటుకు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి విస్తృతంగా వ్యాపిస్తోంది. అదేమిటంటే.. రానున్న రోజుల్లో రూ.2వేల నోటును కేంద్రం ఉపసంహరించుకుంటుందని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఏడాది జూన్ నాటికి రూ.2వేల నోటును వెనక్కి తీసుకునే ఆలోచనను కేంద్రం బయటపెడుతుందని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. తాజాగా రూ.2వేల నోటు ప్రింటింగ్ ను పరిమితం చేయటం ఈవాదనకు మరింత బలం చేకూరేలా చేస్తోంది. దేశంలోని నాలుగు నోట్ల ప్రింటింగ్ ప్రెస్ లు ఉంటే.. ఒక్క దాన్లోనే రూ.2వేల నోటు ప్రింటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. నగదు రహిత లావాదేవీలకు పెద్దపీట వేయాలని మోడీ సర్కారు భావిస్తున్న నేపథ్యంలో.. పెద్ద నోట్లను వీలైనంత తక్కువ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఆ వ్యూహంలో భాగంగానే రూ.2వేల నోటును రానున్న కొద్ది నెలల్లో ఉపసంహరించుకోవటం.. రూ.500నోట్లను పరిమితంగా ముద్రించటం ద్వారా.. నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహం అందించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్లే తాజాగా జరుగుతున్ననోట్ల ప్రింటింగ్ లెక్కలు ప్రభుత్వ విధానాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయని చెప్పొచ్చు. గతంతో పోలిస్తే నోట్ల ముద్రణ 35 శాతం పెరిగినప్పటికీ.. రూ.500నోట్లను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురావాలంటే ఆరునెలలకు పైనే పడుతుందని చెబుతున్నారు. ఇప్పుడు వినిపిస్తున్నట్లుగా రూ.2వేల నోటును జూన్ నాటికి ఉపసంహరిస్తే.. ఆ సమయానికి రూ.500నోట్లను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మరో ఆలోచనను కూడా ప్రభుత్వ వర్గాలు వినిపిస్తున్నాయి. పెద్దనోట్లను వీలైనంత తక్కువగా ప్రింటింగ్ చేయటం ద్వారా.. కరెన్సీ కొరత ఇదే రీతిలో కొనసాగుతుందని.. దీంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడతారని.. అలా అలవాటు పడేందుకే కరెన్సీ కొరత ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేసిందన్నమాట వినిపిస్తోంది. ఈ వాదనల్లో ఏది నిజమన్నది కాలం మాత్రమే డిసైడ్ చేస్తుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/