Begin typing your search above and press return to search.

2018 ఫ్లోరిడాలో జరిగిందే తాజాగా టెక్సాస్ స్కూల్లో జరిగింది.. 15 మంది బలి

By:  Tupaki Desk   |   25 May 2022 2:53 AM GMT
2018 ఫ్లోరిడాలో జరిగిందే తాజాగా టెక్సాస్ స్కూల్లో జరిగింది.. 15 మంది బలి
X
అగ్రరాజ్యానికి గన్ కల్చర్ గుదిబండగా మారింది. పేరుకు ప్రపంచానికి పెద్దన్న అయినప్పటికీ.. సొంత ప్రజలు అన్యాయంగా.. అమానుషంగా.. అనుకోని రీతిలో చోటు చేసుకునే దుర్మార్గాలకు అమాయకులు బలైపోతున్నారు. తాజాగా అలాంటి దుర్మార్గం టెక్సాస్ లోని ఒక స్కూల్లో చోటు చేసుకుంది. నూనుగు మీసాల టీనేజర్ ఒకరు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 14 మంది అభంశుభం తెలియని చిన్నారులు.. ఒక టీచర్ బలయ్యారు. సంచలనంగా మారిన ఈ ఉదంతం గురించి విన్నంతనే 2018లో ఫ్లోరిడా స్కూల్లో జరిగిన మారణహోమం చప్పున గుర్తుకు రాక మానదు.

కాల్పుల ఉదంతంతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. టెక్సాస్ లోని ఒక ప్రాథమిక పాఠశాలలోకి ప్రవేశించిన 18 ఏళ్ల యువకుడు ఒకడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కాల్పుల కారణంగా మరణించిన చిన్నారులంతా నాలుగు నుంచి పద్నాలుగు మధ్య వయస్కులే కావటం గమనార్హం.

పసిమొగ్గల్లాంటి పిల్లలు ఒక ఉన్మాది కారణంగా ప్రాణాలు విడవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ మారణకాండ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి. . కాల్పులకు పాల్పడిన ఉన్మాదిని కాల్చి చంపినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. స్థానిక పోలీసులు మరో అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన ఘటనగా టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబాట్ పేర్కొన్నారు.

అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పుల ఉదంతం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. మెక్సికస్ సరిహద్దుల్లోని ఉవాల్డే పట్టణంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు ఒకరు గన్ తీసుకొని రోబ్ ఎలిమెంటరీ స్కూల్లో ప్రవేశించాడు. అతని వద్ద రైఫిల్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఆ సమయంలో స్కూల్లో మొత్తం 500 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నారు. స్కూల్లోకి వచ్చినంతనే వెనుకా ముందు చూసుకోకుండా కాల్పులు జరిపేశాడా ఉన్మాది. ఈ కారణంగా ఒక టీచర్ తోపాటు మరో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. వారి కుటుంబాలు తీవ్ర వేదనకు గురవుతున్నాయి. వారి వేదన చూసినోళ్ల కళ్లు చెమరుస్తున్నాయి.

స్కూల్లో జరిగిన కాల్పుల ఉదంతాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు తెలియజేశారు. తీసుకున్న చర్యల్ని ఆయనకు వివరించారు. కాల్పుల ఉదంతంతో అప్రమత్తమైన పోలీసులు.. స్కూల్ ను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇలాంటి ఘోర ఉదంతమే 2018లో ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లో చోటు చేసుకుంది. అప్పట్లో 14 మంది హైస్కూల్ విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ఘటన తర్వాత ఇదే అతి పెద్ద దారుణ ఘటనగా చెబుతున్నారు. ఈ మధ్యనే సూపర్ మార్కెట్ వద్ద కూడా ఇదే తరహాలోకాల్పులు జరిగిన విషయం తెలిసిందే.