Begin typing your search above and press return to search.

ఏపీ ఫలితాలు, కులపిచ్చిపై మాధవీలత కామెంట్

By:  Tupaki Desk   |   13 May 2019 6:04 AM GMT
ఏపీ ఫలితాలు, కులపిచ్చిపై మాధవీలత కామెంట్
X
సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో బీజేపీ చేరి ఈ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకున్నారు మాధవీలత.. కానీ ఎన్నికల సంగ్రామంలోకి దిగాక కానీ ఆమె అసలు పరిస్థితేంటో అర్థం కాలేదు. ఎన్నికల్లో పేరు, పరపతి ఉంటే గెలుపు అసాధ్యమని మాధవీలతకు ఈ ఎన్నికలతో అర్థమైనట్టుంది. అందుకే పేరు, పాపులారిటీ కన్నా ఏపీ ఎన్నికల్లో కులం, డబ్బు ప్రభావం ఎక్కువ కనిపించిందని వాపోయింది..

2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు తిరుపతిలో నిర్వహించిన సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. కానీ ఆ జనాన్ని ఓట్లుగా మలచడంలో చిరు విఫలమయ్యాడు. పేరు, పరపతి ఉన్నా చిరంజీవి ఆ ఎన్నికల్లో పట్టుమని 18 సీట్లు సాధించలేకపోయారు. కులం, డబ్బు ప్రభావం స్పష్టమని ఎన్నికల్లో తేలిపోయింది.

ఆ అనుభవాల సారమో ఏమో కానీ మాధవీలత ఈసారి ఏపీ ఎన్నికల్లో పోటీచేసి అదే మాట అన్నారు. ఏపీ ఎన్నికల్లో కులం, డబ్బు ప్రభావం బాగా ఎక్కువ పనిచేసిందని వాపోయారు. కులానికి, డబ్బులకు లొంగకుండా రాజకీయాల్లో నిలబడే వారే నిజమైన నాయకులుగా మిగులుతారని చెప్పుకొచ్చింది. ప్రజలు కూడా అలాంటి వారినే ఎన్నుకుంటున్నారని వాపోయింది... తెలుగువాళ్లు డబ్బు తీసుకొని ఓట్లేస్తున్నారు.. ప్రపంచంలోనే బాగా డ్యామేజ్ అయ్యారు. ఏపీలోనే గుంటూరులో పరిస్థితి ఘోరం. ఇక్కడ కుల, డబ్బు రాజకీయాలు చాలా ఎక్కువ.. ఈ జాడ్యం కొనసాగుతున్నంత సేపు నిజాయితీపరులైన నాయకులు ఇక పుట్టుబోరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తనకు తెలుసు అని.. కానీ నా నోటితో అది చెప్పను అని మాధవీలత మౌనం దాల్చారు. ప్రజలు ఊహించిన దానికి భిన్నంగా తీర్పునివ్వవచ్చు కదా అని ప్రశ్నించారు.