Begin typing your search above and press return to search.

2021.. మరో జీరో ఇయరేనా?

By:  Tupaki Desk   |   21 Feb 2021 11:30 PM GMT
2021.. మరో జీరో ఇయరేనా?
X
కంటికి కనిపించని ఒక మాయదారి వైరస్ ప్రపంచ ప్రజల జీవితాల్ని ఎంతలా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసింది కరోనా. దీని దెబ్బకు ఎప్పుడూ వినని లాక్ డౌన్.. భౌతికదూరం.. లాంటి కొత్త మాటలే కాదు.. ముఖానికి మాస్కు.. చేతులకు శానిటైజర్లు లాంటివెన్నోప్రపంచంలోని అందరికి అనుభవంలోకి వచ్చేశాయి. అన్నింటికి మించిన 2020 పెద్ద గుండు సున్నాగా మారింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరి జీవితాల్లో జీరో ఇయర్ గా మారింది. మరి.. 2021 ఎలా ఉంటుందన్న దానికి చాలామంది చాలా ఆశలే పెట్టుకున్నారు.
అయితే.. ఈ ఆశల్ని కాస్త తగ్గించుకుంటే మంచిదన్న మాట నిపుణుల నోట వినిపిస్తోంది. కరోనాకు సంబంధించి.. ఇక అంతా అయిపోయిందనుకుంటే తప్పులో కాలేసినట్లేనని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే దేశంలోనూ.. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కలకలం నెమ్మదిగా మొదలవుతోంది. మన దేశంలోనే చూస్తే.. కొన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కరోనా చాపకింద నీరులా పాకుతోంది.

దీంతో.. 2020 నాటి మార్చి ఫీవర్.. తాజాగా మరోసారి చుట్టుముట్టనుందా? అన్నదిప్పుడు ప్రశ్న. ఇప్పటికే సెంట్రల్ యూరోప్ లో మూడో దశ కరోనా వచ్చేసిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్లే.. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరగుతున్నాయి. ఆ మధ్య వరకు కరోనా పేరు విన్నంతనే లైట్ తీసుకునే వారికి ఇప్పుడు కొత్త భయాన్ని కలిగేలా కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే వారిని కర్ణాటకకు అనుమతించటం లేదు. అదే సమయంలో కేరళ నుంచి కర్ణాటకకు వచ్చే వారి మీదా నియంత్రణ మొదలవుతోంది.

ఇలాంటివేళ.. మహారాష్ట్రకు చెందిన ఎపిడెమియాలజీ నిపుణుడు డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ కొత్త విషయాల్ని వెల్లడించారు. కరోనా చాలా తీవ్రమైనదని.. ప్రతి కేసును జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. పలు రాష్ట్రాల్లో పాజిటివ్ లు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలు మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో మరిన్ని కట్టుదిట్టమైన చర్యల్ని చేపట్టాల్సిన అవసం ఉందని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. కేసుల తీవ్రత మరింత పెరిగే లోపే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. దీనికి సంబంధించి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఖరీదైన మూల్యాన్ని మాత్రమే కాదు.. 2021కూడా జీరోఇయర్ గా మారే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.