Begin typing your search above and press return to search.

గతేడాది తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..?

By:  Tupaki Desk   |   2 Jan 2022 6:57 AM GMT
గతేడాది తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..?
X
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కొత్త సంవత్సరంలో పెగనుంది. జీఎస్టీ చెల్లింపులో విధానమైన మార్పులను తీసుకురావడంతో మరింత భారం పడనుంది.దీంతో ఈ కామర్స్ వెబ్ సైట్ ల నుంచి జరిపే కొనుగోళ్ల నుంచి ఆటోల రైడ్ ల వరకు ధరలు పెరగనున్నాయి. జనవరి 1 నుంచి దాదాపు అన్ని వస్తువులు ఖరీదు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి కొన్ని వస్తువులపై 5 శాతం నుంచి 12 శాతం పెంచింది. అయితే వస్త్రాలపై పెంచిన జీఎస్టీని ఉపసంహరించుకుంది. అయితే గత సంవత్సరంలో కేంద్రానికి వచ్చిన జీఎస్టీ రాబడి ఎంత..? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంత వెళ్లింది..?

ఆర్థిక శాఖ జీఎస్టీ రాబడిపై వివరాలను తెలిపింది. 2021 డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 13 శాతం పెరిగాయి. అంటే రూ.1,29,780 కోట్లు వసూలయ్యాయి. ఇందులో కేంద్రానికి రూ.22,578 కోట్లు రాగా.. రాష్ట్రానికి రూ.28,658 కోట్లు వచ్చింది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.69,155 కోట్లుగా ఉంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, పన్ను ఎగవేత నియంత్రణ చర్యలు, జీఎస్టీ వసూళ్లు పెరడానికి కారణమయ్యాయి. అయితే నవంబర్ నెలతో పోలిస్తే డిసెంబర్లో కాస్త తగ్గాయి. నవంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1, 31 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సగటున జీఎస్టీ వసూళ్లు రూ.1,30 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు రెండు త్రైమాసికాల్లో సగటున రూ.1,10 లక్షల కోట్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల నుంచి జీఎస్టీ ఆదాయం వివరాలను పరిశీలిస్తే.. తెలంగాణ నుంచి రూ.3,760 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020 డిసెంబర్ తో పోలిస్తే 2021 డిసెంబర్ తెలంగాణ నుంచి జీఎస్టీ వసూళ్లు 6 శాతం పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో 2020 డిసెంబర్ నెలతో పోలిస్తే 2021లో జీఎస్టీ వసూళ్లు రెండు శాతం పెరిగాయి. అంటే రూ.2,532 కోట్లు వచ్చాయి. గోవాలో ఈ ఏడాది జీఎస్టీ కలెక్షన్ 73 శాతం పెరిగింది. నవంబర్ నెలతో పోలిస్తే 14 శాతం పెరిగింది. జాతీయ జీఎస్టీ వసూళ్ల కంటే గోవాలో వసూళ్లు ఎక్కువ.

మరోవైపు వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది.వచ్చే జీఎస్టీ మండలి భేటీలో ఈ విషయంపై అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారు. చేనేత, జౌళీ పరిశ్రమై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతం పెంచాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతానికి దానిని వాయిదా వేశారు. దుస్తులపై జీఎస్టీని పెంచడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. డిసెంబర్ 30 దేశ వ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ రంగానికి చెందిన వారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో వెంటనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామణ్ ప్రకటించారు.