Begin typing your search above and press return to search.

21 రోజుల లాక్ డౌన్ తో జరిగిన నష్టం అన్ని లక్షల కోట్లు?

By:  Tupaki Desk   |   14 April 2020 4:10 AM GMT
21 రోజుల లాక్ డౌన్ తో జరిగిన నష్టం అన్ని లక్షల కోట్లు?
X
కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు దేశ వ్యాప్తంగా విధించిన ఇరవై ఒక్కరోజుల లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం ఇంతా అంతా కాదని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. లాక్ డౌన్ కారణంగా యావత్ దేశం స్తంభించిపోవటమేకాదు.. అత్యవసర సేవలు తప్పించి.. అన్ని ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోవటం తెలిసిందే. ఒక అంచనా ప్రకారం దేశ ఆర్థిక రంగానికి జరిగిన నష్టం ఏకంగా రూ.7 నుంచి రూ.8లక్షల కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు.

రోజుకు సుమారు రూ.35వేల కోట్ల మొత్తాన్ని నష్టపోయినట్లుగా లెక్క కట్టింది సెంట్రల్ ఇన్ స్టిట్యూషనల్ రీసెర్చ్ సంస్థ. చాలా కొద్ది సేవలు తప్పించి.. మిగిలిన ఆర్థిక కార్యకలాపాలన్ని ఎక్కడివక్కడ నిలిచి పోవటం తో భారీగా ఆదాయాన్ని కోల్పోయినట్లుగా గుర్తించారు.

రవాణా.. హోటళ్లు.. రియల్ ఎస్టేట్.. పర్యాటక రంగాలపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపినట్లుగా తేల్చారు. రియల్ ఎస్టేట్ ఒక్క రంగంలోనే లక్ష కోట్ల రూపాయిల నస్టం వాటిల్లినట్లుగా లెక్క కట్టారు. ఇక.. రవాణా రంగానికి వస్తే.. తొలి పదిహేను రోజుల్లో రూ.35వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. మిగిలిన రంగాలతో పోలిస్తే.. రిటైల్ రంగం కాస్త తక్కువ నష్టాన్ని నమోదు చేసినట్లు చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది అంచనా వేసిన వృద్ధి రేటు 5.2 శాతం నుంచి 2 శాతానికే పరిమితమవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా ప్రభుత్వాలే కాదు.. ప్రజలు సైతం భారీగా నష్ట పోయినట్లుగా చెప్పక తప్పదు.