Begin typing your search above and press return to search.

తాళిని తీసి అవతల పారేశారు

By:  Tupaki Desk   |   14 April 2015 7:11 PM GMT
తాళిని తీసి అవతల పారేశారు
X
తాళి ఎగతాళి అయ్యింది. సంప్రదాయం.. సంస్కృతిని అవహేళన చేస్తూ.. సరికొత్త కల్చర్‌కు తామే బ్రాండ్‌ అంబాసిడర్ల మంటూ తమిళనాడులోని కొందరు చేసిన పని ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.

తమిళనాడులోని ద్రావిడార్‌ కళగం అనే హేతువాద సంస్థ సరికొత్త ప్రచారం మొదలుపెట్టింది. మంగళసూత్రంలో మహత్తు లేదని.. మగవాడికి లేని మంగళసూత్రం.. ఆడవాళ్లకు మాత్రమే ఎందుకు ఉండాలని.. మంగళసూత్రం.. మహిళల బానిసత్వాన్ని చెప్పకనే చెప్పేస్తుందంటూ చిత్రమైన వాదనను ప్రచారం చేయటమే కాదు.. ఇందుకు అనుగుణంగా తాము తాళుల్ని తీసి పారేస్తామన్న వాదనతో కోర్టుకు వెళ్లారు.

వీరి వాదనను వ్యక్తిగత స్వేచ్ఛకోణంలో సింగిల్‌ జడ్జి కోర్టు మంగళసూత్రాల్ని తీసి పారేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే.. సంప్రదాయాలు.. సంస్కృతితో ముడి పడి ఉన్న అంశంగా పేర్కొంటూ తీర్పుపై కోర్టుకు వెళ్లారు. వీరి వాదనతో.. అంతకు ముందు కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చారు.

అయితే.. మొదట కోర్టు ఇచ్చిన అనుమతి నేపథ్యంలో పాతిమంది మహిళలు తమ మెడలో ఉన్న మంగళసూత్రాల్ని ఉదయం 6.45 గంటలకు ముహుర్తం పెట్టుకొని మరీ తెంపేశారు. ఈ సందర్భంగా తాము బానిసత్వం నుంచి బయటపడినట్లు గర్వంగా ప్రకటించుకున్నారు. అదే సమయంలో ఎంటర్‌ అయిన పోలీసులు..ఈ కార్యక్రమంపై కోర్టు ఒప్పుకోలేదన్న ఉత్తర్వులు చూపిస్తూ.. కార్యక్రమాన్ని మధ్యలో ఆపేశారు. ఈ మంగళసూత్రాలు తెంపేసే కార్యక్రమం తర్వాత ఆవుమాంసంతో భోజనం చేసే ప్రోగ్రాం కూడా ఉంది. అయితే.. దీనికి కోర్టు అనుమతి ఇవ్వకపోవటంతో కార్యక్రమాన్ని మధ్యలో ఆపేశారు.

హేతువాదులమని గొప్పలు చెప్పుకుంటూ.. మెడలో మంగళసూత్రాల్ని విసిరిపారేయటంతోనే స్వేచ్ఛ వచ్చేస్తుందా? బానిసత్వం నుంచి బయటపడిపోతారా? లాంటి ప్రశ్నలు సంప్రదాయవాదులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. వీరి చర్యపై తమిళనాడులో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. హేతువాదులమని చెప్పుకునే వారు.. తాళిబట్టును విసిరికొట్టారే సరే.. దానికి ముహుర్తం ఎందుకు? ఏదో ఒక సమయంలో తీసి పారేయొచ్చుగా..?