Begin typing your search above and press return to search.

సెల్ఫీ...పిచ్చికి ఇది పరాకాష్ట

By:  Tupaki Desk   |   26 May 2015 11:03 AM GMT
సెల్ఫీ...పిచ్చికి ఇది పరాకాష్ట
X
ఎవరికైనా..ప్రపంచంలో అన్నింటికంటే కంటే తనను తాను ఇష్టపడే గుణం తప్పక ఉంటుంది. అందులో క్రేజీగా వచ్చి చేరిందే ఈ మధ్య సొంతంగా ఫొటోలు తీసుకోవడం. అదేనండి సెల్ఫీ. అలా సరదాకు తీసుకుంటున్న సెల్ఫీలు ప్రాణాంతకమా కాదా అనే జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించడం మూర్ఖత్వం కాక మరేమిటి?

మాస్కోలోని ఓ యువతి పిస్టల్‌తో కణత మీద కాల్చుకుంటున్నట్టు సెల్ఫీ దిగే ప్రయత్నం చేసింది. అయితే హడావుడిలో కెమెరా బటన్‌ నొక్కబోయి పిస్టల్‌ ట్రిగ్గర్‌ నొక్కేసింది. సీన్‌ కట్‌ చేస్తే...ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌ కాల్పు కావడం వల్ల ఆమె ప్రాణాపాయం నుంచి గట్టెక్కుతుందా లేదా అన్న విషయం అప్పుడే చెప్పలేమని చికిత్స చేస్తున్న ఆస్పత్రి వైద్యులు చెప్పారు.

21 సంవత్సరాల వయసు గల ఆమె పనిచేస్తున్న కార్యాలయంలోని పిస్టల్‌నే తన సెల్ఫీ కోసం ఉపయోగించిందట. ఆఫీస్‌ లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు రెండు వారాలపాటు సెలవుపై వెళ్తూ పిస్టల్‌ను ఆ కార్యాలయంలోనే వదిలిపోయారని, దాంతో సెల్ఫీకోసం క్లిక్‌ మనిపించబోయి చావుబతుకుల మధ్య ఉండాల్సిన స్థితికి చేరి ఉంటుందని భావిస్తున్నారు.

ఈమధ్య కాలంలో రుమేనియాలో అన్నా ఉర్సు అనే యువతి తన స్నేహితురాలితో కలిసి రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఎలక్ట్రిక్‌ వైర్లను తాకి మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే.


సెల్‌ పోన్‌లో ఒక్క చిటికెలో ఇలా సెల్ఫీ తీసుకోవడం, అలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం కొందరు యువతకు నిత్యకృత్యమైపోయింది. ఈ హడావుడిలో ఎటునుంచి ఏం ప్రమాదం ముంచుకువస్తుందో కూడా వాళ్లు గమనించుకోకపోవడం వల్ల సెల్ఫీలు తీసుకుని ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారనే భావన ఇలాంటి ఘటనలు చూస్తే కలుగుతోంది.