Begin typing your search above and press return to search.

షాకింగ్..హైదరాబాద్ పోలీసుల్లో 23 మందికి పాజిటివ్?

By:  Tupaki Desk   |   28 May 2020 4:30 AM GMT
షాకింగ్..హైదరాబాద్ పోలీసుల్లో 23 మందికి పాజిటివ్?
X
వణికిస్తున్న మాయదారి మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్న వైనం తెలిసిందే. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందన్న వాదనకు బలం చేకూరేలా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ మహానగరంలోని పోలీసుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 23 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని.. ప్రస్తుతం వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల కాలంలో పలువురు పోలీసులకు పాజిటివ్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో.. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా గడిచిన రెండు రోజుల (మంగళ.. బుధవారాల్లో) వ్యవధిలో 23 మంది పోలీసులకు పాజిటివ్ గా రిపోర్టులు వచ్చినట్లుగా సమాచారం. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా లాక్ డౌన్ విధులు నిర్వర్తించటం.. వలసకూలీల్ని పెద్ద ఎత్తున వారి సొంతూళ్లకు పంపే కార్యక్రమాన్ని నిర్వహించటంతో పాటు.. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు పాజిటివ్ ల బారిన పడటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

హైదరాబాద్ మహానగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మాయదారి రోగ లక్షణాలతో బాధ పడుతున్న వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. దీంతో పలువురిలో పాజిటివ్ లుగా తేలినట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగు చూసిన పాజిటివ్ కేసుల్లో అత్యధికులు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వారుకావటం గమనార్హం. ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువమందికి తక్కువ మోతాదులో జ్వరం ఉందని.. గొంతునొప్పి.. జలుబు లాంటివి లేవన్న మాట వినిపిస్తోంది. ఒకట్రెండు రోజుల వ్యవధిలో 23 మంది(?) వరకు పాజిటివ్ లు తేలిన వైనం పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.