Begin typing your search above and press return to search.

హైదరాబాద్ జర్నలిస్టులకు దిమ్మ తిరిగే షాక్.. రోజులో 23 మందికి పాజిటివ్

By:  Tupaki Desk   |   15 Jun 2020 4:30 AM GMT
హైదరాబాద్ జర్నలిస్టులకు దిమ్మ తిరిగే షాక్.. రోజులో 23 మందికి పాజిటివ్
X
ప్రజల సమస్యలు.. మహమ్మారి వేళ.. ప్రభుత్వ ఏర్పాట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రంట్ లైన్ వారియర్స్ లో కీలకమైన జర్నలిస్టుల్ని మాయదారి రోగం కమ్మేసింది. ఈ మధ్యనే కొందరు జర్నలిస్టులకు పాజిటివ్ గా తేలటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు.. నాలుగు రోజుల క్రితం తెలంగాణ సెక్రటేరియట్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మహమ్మారి నిర్దారణ పరీక్షల్ని నిర్వహించారు.

ఈ టెస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తంగా నలబై మందికి నిర్వహించిన పరీక్షల్లో 23 మందికి పాజిటివ్ గా తేలటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఆదివారం సాయంత్రం వేళలో బయటకు వచ్చింది. హైదరాబాద్ మీడియాలో ఇదో షాకింగ్ గా మారింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా రిపోర్టింగ్ లో ఉన్న వారికి.. డెస్కులో ఉన్న వారికి సైతం పాజిటివ్ కావటం గమనార్హం.

పాజిటివ్ గా తేలిన 23 మందిలో రోగ లక్షణాలు ఎక్కువగా ఉన్న వారెవరూ లేరన్న మాట వినిపిస్తోంది. దీంతో పలువురికి ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలన్న సూచనను చేసినట్లు చెబుతున్నారు. మరికొందరి విషయంలో మాత్రం ఆసుపత్రిలో చేర్చుకొని ట్రీట్ మెంట్ షురూ చేసినట్లుగా తెలుస్తోంది.

తాజాగా పాజిటివ్ గా తేలిన వారిలో చాలా మందికి నేచర్ క్యూర్ ఆసుపత్రిలో వైద్య సాయాన్ని అందిస్తారని చెబుతున్నారు. ఏమైనా.. కలం వీరులుగా చెప్పే పాత్రికేయ యోధులకు దిమ్మ తిరిగే మహమ్మారి షాకిచ్చిందని చెప్పక తప్పదు. తాజాగా విడుదలైన ఫలితాలతో హైదరాబాద్ లోని పలు మీడియా సంస్థల్లో పని చేసే వారి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీలైనంత త్వరగా తమకు సైతం నిర్దారణ పరీక్షలు చేయాలని వారు కోరుతున్నారు. మరి.. వీరి రిక్వెస్టును ఏం చేస్తారో చూడాలి.