Begin typing your search above and press return to search.

రెండు రాష్ట్రాలు..రెండు ప్ర‌మాదాలు..

By:  Tupaki Desk   |   11 Jun 2017 6:10 AM GMT
రెండు రాష్ట్రాలు..రెండు ప్ర‌మాదాలు..
X
ఒకేరోజు.. కొద్ది గంట‌ల తేడాతో రెండు రాష్ట్రాల్లో జ‌రిగిన రెండు రోడ్డు ప్ర‌మాదాల‌కు ఏకంగా 24 మంది మృతి చెందిన వైనం దేశ ప్ర‌జ‌ల‌ను షాక్‌కు గురి చేసింది. ఆదివారం ఉద‌యం చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌లు అంద‌రినీ క‌లిచి వేసి ప‌దుల కుటంబాల‌ను రోడ్డున ప‌డేశాయి. మ‌హారాష్ట్ర.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో జ‌రిగిన రెండు రోడ్డు ప్ర‌మాదాల్లో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. మ‌రింత మంది తీవ్ర గాయాల‌తో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు రోడ్డు ప్ర‌మాదాలను చూస్తే..

ముంబ‌యి నుంచి లాతూరు వెళుతోన్న ఒక ప్రైవేటు బ‌స్సు మ‌హారాష్ట్రలోని బీడ్ జిల్లా ధ‌నోరా గ్రామం వ‌ద్ద భారీ రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఆదివారం ఉద‌యం ఐదున్న‌ర గంట‌ల ప్రాంతంలో అదుపుత‌ప్పి బోల్తా ప‌డిన బ‌స్సు కార‌ణంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది తీవ్ర గాయాల‌కు గుర‌య్యారు. స‌మాచారం తెలిసిన వెంట‌నే స్థానికులు.. అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. డ్రైవ‌ర్ అతి వేగ‌మే తాజా ప్ర‌మాదానికి కార‌ణంగా చెబుతున్నారు. నిర్ల‌క్ష్యంగా వాహ‌నాన్ని న‌డ‌ప‌టంతో ఇంత భారీ ఎత్తున ప్రాణ న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోనూ ఒక ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌యాణికుల‌తో వెళుతున్న ఒక కారు అదుపు త‌ప్పి న‌దిలోకి ప‌డిపోయింది. ఈ ఉదంతంలో ప‌ది మంది మ‌ర‌ణించారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. ఇన్నోవా కారులో కుటుంబంతో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లి వ‌స్తున్న స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ఈ విషాదం చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. డ్రైవ‌ర్ అతి వేగ‌మే తాజాప్ర‌మాదానికి కార‌ణంగా భావిస్తున్నారు. ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్న స‌హాయ‌క బృందం.. కారులో ఉండిపోయిన మృత‌దేహాల్ని బ‌య‌ట‌కు తీశారు. కారు డ్రైవ‌ర్ గ‌ల్లంత‌య్యారు. ఆయ‌న కోసం అధికారులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఈ రెండు రోడ్డు ప్ర‌మాదాల షాక్ నుంచి తేరుకోక ముందే తెలుగు రాష్ట్రాల్లోనూ రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఏపీలోని విశాఖప‌ట్నంలో రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. శ‌నివారం అర్థ‌రాత్రి జ‌రిగిన ఈ రోడ్డు ప్ర‌మాద స‌మాచారాన్ని అధికారులు గోప్యంగా ఉండ‌టంతో.. స‌మాచారం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

విశాఖ‌లోని యారాడ నేవీ ఘాట్ రోడ్డులో నేవీ ఉద్యోగుల‌తో ప్ర‌యాణిస్తున్న కారు అదుపు త‌ప్పి కొండ‌ను ఢీ కొంది. ఈ ఘ‌ట‌న‌లో నేవీ లెఫ్టినెంట్ క‌మాండ‌ర్ అవినాష్ ఠాకూర్ మృతి చెందారు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ప్ర‌మాదం ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగింది లేద‌ని.. అతి వేగంతో కారును న‌డ‌ప‌టంతోనే ఇంత ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌న్న అంచనాను అధికారులు వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/