Begin typing your search above and press return to search.

ముగిసిన ఏపీ కేబినెట్:24మంది మంత్రుల రాజీనామా

By:  Tupaki Desk   |   7 April 2022 12:17 PM GMT
ముగిసిన ఏపీ కేబినెట్:24మంది మంత్రుల రాజీనామా
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటిలో 36 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే 24మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎంకు అందజేసినట్టు సమాచారం.

24మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్ విశ్వభూషణ్ కు పంపనున్నారు. ఈ రాత్రికి ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈనెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది.

మరోవైపు ఈనెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్ ఎదుట ప్రమాణ స్వీకార వేదికను నిర్మించాలని నిర్ణయించారు.

ఇక చివరి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జడ్పీల కాలపరిమితి ముగిసే వరకూ కొనసాగించేందుకు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

రాజమండ్రిలో హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్ కోసం ఏపీ టూరిజం కార్పొరేషన్ కు 6 ఎకరాలు ఉచితంగా కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

హెల్త్ హబ్ పథకం కింద రాజమండ్రి, కర్నూలు, విజయనగరం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆసుపత్రుల నిర్మాణానికి భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలిపింది.