Begin typing your search above and press return to search.

అబార్షన్ గడువు 24 వారాలకు పెంపు , మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం !

By:  Tupaki Desk   |   14 Oct 2021 4:47 AM GMT
అబార్షన్ గడువు 24 వారాలకు పెంపు , మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం !
X
కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన మహిళలు అబార్షన్‌‌ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను వెల్లడించింది. వీరి అబార్షన్ గరిష్ఠ కాల పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం గర్బం దాల్చిన 20 వారాల్లోగా అబార్షన్‌ చేయించుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీల మహిళలకు దీనిని 24 వారాలకు పెంచారు. లైంగిక దాడులు, అత్యాచారాలకు గురై గర్భం దాల్చినవారు, గర్భవతిగా ఉన్నప్పుడు విడాకులు తీసుకున్నవారు లేదా భర్త చనిపోయినవారు, మైనర్‌ బాలికలు, దివ్యాంగులు, మానసిక వికలాంగులు ఈ ప్రత్యేక కేటగిరీల కిందకు వస్తారు.

అబార్షన్‌ సవరణ చట్టం 2021 ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లో గర్భం దాల్చిన మహిళలు అబార్షన్‌కు అర్హులని పేర్కొంది. కొన్నివర్గాల మహిళలకు గర్భాన్ని తొలగించే విధానంలో అమలు చేయాల్సిన విధి విధానాలను ఈ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీని ద్వారా అసాధారణ పరిస్థితుల్లో గర్భం దాల్చిన మహిళలు 24 వారాల తర్వాత కూడా గర్భస్రావం చేయించుకునేందుకు ఇప్పుడు కేంద్రం అనుమతించింది. అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలోనూ గర్భం దాల్చినవారిని కూడా ఈ ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తారు. తీవ్ర శారీరక, మానసిక వైకల్యాలతో శిశువు జన్మించే అవకాశం ఉన్న సందర్భాల్లో కూడా 24 వారాల్లోగా అబార్షన్‌ కు అనుమతిస్తారు.

కాగా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక మెడికల్‌ బోర్డును ఏర్పాటుచేస్తారు. 24 వారాల తర్వాత అబార్షన్‌ చేయించుకోవాలంటే ఈ బోర్డు అనుమతి తప్పనిసరి. 1971 నాటి చట్టానికి సవరణలను చేసిన కేంద్ర ప్రభుత్వం, అత్యాచార బాధితులు, మైనర్లు, వైకల్యం కలిగిన మహిళలకు అబార్షన్ల విషయంలో ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో పార్లమెంట్‌ ఆమోదించడంతో గరిష్టంగా 24వ వారంలోనూ అబార్షన్ చేయించుకునే వెసులుబాటు లభించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 20 వారాల్లోపు గర్భిణి అబార్షన్ చేయించుకోవడానికి ఒక డాక్టర్ అభిప్రాయం, 24 వారాల్లో గర్భవిచ్చిత్తికి ఇద్దరు డాక్టర్ల అభిప్రాయం తీసుకునేలా చట్టంలో సవరణలను చేశారు. అయితే, అబార్షన్ చేయించుకున్న మహిళ పేరును బహిర్గతం చేయకూడదు. అత్యాచారాలకు గురైన బాలికలు తొలి ఐదు నెలల గర్భం సమయంలో తాము గర్భం దాల్చామనే విషయాన్ని గ్రహించకపోవడంతో అబార్షన్ కాలపరిమితిని 24 వారాలకు పెంచారు.