Begin typing your search above and press return to search.

ఐఏఎస్ లు వస్తున్నారు..కొత్త జిల్లాలే తరువాయి..

By:  Tupaki Desk   |   16 May 2016 10:51 AM GMT
ఐఏఎస్ లు వస్తున్నారు..కొత్త జిల్లాలే తరువాయి..
X
రాష్ట్రానికి కొత్త ఐఏఎస్‌ పోస్టులు రాబోతున్నాయి. ఉన్న పోస్టులకు అదనంగా మరో 50 పోస్టుల వరకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అది నిజమైతే రాష్ట్రానికి ఉన్న అధికారుల కొరత రానున్న కాలంలో తీరిపోనుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి 50 మంది ఐఏఎస్‌ లను అదనంగా కేటాయించడానికి కేంద్రం ఓకే చెప్పింది. మరో పదిహేను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆశలు కూడా తీరుతాయని సమాచారం. నేరుగా నియమితులైన ఐఏఎస్‌ అధికారుల తోపాటు, పదోన్నతిపై ఐఏఎస్‌ గా నియమితులయ్యే వారు కూడా వీరిలో ఉండే అవకాశాలున్నాయి.

వాస్తవంగా ప్రతి రాష్ట్రానికి కావాల్సిన ఐఏఎస్‌ కాడర్‌ సంఖ్యపై ఐదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది. దాని ఆధారంగా పెంచాలా తగ్గించాలా అన్నది నిర్ణయిస్తుంది. అయితే 2014లో ఏపీ విభజన నేపథ్యంలో అయిదేళ్లకు ముందుగానే ఈ సమీక్ష జరపాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఇదే సమయంలో తమకు ఐఏఎస్‌ ల కొరత తీవ్రంగా ఉందని.. కొత్తవారిని కేటాయించాలని రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ముందుగా తెలంగాణ అవసరాలను గుర్తించిన కేంద్రం వారి విషయంలో ఇప్పటికే కేటాయింపు నిర్ణయం తీసుకుంది. ఏపీ కంటే తెలంగాణ నుంచి ప్రతిపాదనలు ముందుగా వెళ్లడంతో వారికి సంబందించిన నిర్ణయం తొందరగా వెలువడిందని చెబుతున్నారు. ఏపీ నుంచి ఇంకా పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్రానికి అందలేదని... ఈలోగానే ఐఏఎస్‌ ల కేటాయింపుపై డిఓపిటి నిర్వహించిన ఒక సమావేశం ముగియడంతో తొలి విడతలో ఏపీకి అవకాశం దక్కలేదు. త్వరలో రెండో సమావేశం ఉండడంతో అది పూర్తయిన తరువాత కేటాయిస్తారని తెలుస్తోంది.

విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి 374 ఐఏఎస్‌ పోస్టులు ఉండగా.. అందులో 294 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆ పోస్టులను - వ్యక్తులను రెండు రాష్ట్రాలకు పంపకాలు చేశారు. ఉన్న 374 పోస్టుల్లో ఏపీకి 211 పోస్టులు - తెలంగాణకు 163 పోస్టులను కేటాయించారు. అలాగే పనిచేస్తున్న 294 మందిలో ఏపీకి 164 మందిని, తెలంగాణకు 128 మందిని పంపకాలు చేశారు. ఉన్న పోస్టులే చాలని నేపథ్యంలో పనిచేస్తున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో రెండు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు కూడా ఐఏఎస్ లు కావాలని కేంద్రాన్ని కోరాయి.

కాగా తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడుతుండడంతో అదనపు ఐఏఎస్ లు ఆ దిశగానూ ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏపీకి కూడా కొత్త అధికారులు వస్తే ఏపీలోనూ జిల్లాల విభజన చేపట్టే అవకాశాలుంటాయి. చంద్రబాబు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకంటారో చూడాలి.