Begin typing your search above and press return to search.

తండ్రి లేని అమ్మాయిల పెళ్లి బాధ్య‌త ఆయ‌న‌దేన‌ట‌!

By:  Tupaki Desk   |   27 Dec 2017 11:30 PM GMT
తండ్రి లేని అమ్మాయిల పెళ్లి బాధ్య‌త ఆయ‌న‌దేన‌ట‌!
X
గుజ‌రాత్‌... న‌రేంద్ర మోదీ వంటి సాహ‌సోపేత రాజ‌కీయ నేత‌ను దేశానికి అందించిన రాష్ట్రంగానే కాకుండా భార‌త వాణిజ్య విఫ‌ణిని విశ్వ‌వ్యాప్తం చేసిన వ్యాపారస్తుల‌ను కూడా అందించిన రాష్ట్రంగానూ మ‌న‌కు తెలిసిందే. అందుకే గుజ‌రాత్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ప్ర‌త్యేక‌మైన రాష్ట్రంగా గుర్తింపు సాధించింది. నిండా వ్యాపార‌వేత్త‌లు క‌లిగిన ఈ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక సామాజిక కార్య‌క్ర‌మం జ‌రుగుతూనే ఉంటుంది. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఈ రాష్ట్రంలో క‌నిపించినంత‌గా మ‌రే రాష్ట్రంలోనూ క‌నిపించ‌దంటే అతిశ‌యోక్తి కాదేమో. అయినా అస‌లు విష‌యం చెప్ప‌కుండా... వ‌రుస‌గా గుజ‌రాత్ గొప్ప‌లు చెప్పుకుంటే పోతే ఎలాగంటారా? అయితే అస‌లు విష‌యంలోకి వెళ‌దాం.

గుజ‌రాత్‌లో వ‌స్త్ర‌వ్యాపారానికి కాణాచిగా నిలిచిన సూర‌త్ లో బ‌డా వ్యాపార‌వేత్త‌లు ఉంటారు. వారిలో మ‌హేశ్ స‌వానీ కూడా ఒక‌రు. వ‌స్త్ర వ్యాపారంలో క్ష‌ణం కూడా తీరిక లేకుండా గ‌డిపే స‌వానీ... సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కు కూడా పెద్ద పీట వేస్తున్నారు. ప్ర‌ధానంగా తండ్రి లేని అమ్మాయిల‌కు పెళ్లిళ్లు చేసి... వారికి చీకు చింతా లేని జీవితాన్ని ప్ర‌సాదించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న స‌వానీ... మొన్న ఆదివారం నాడు ఒకే వేదిక‌పై ఏకంగా 251 మంది తండ్రి లేని నిరుపేద అమ్మాయిల‌కు సామూహిక వివాహాలు చేశారు. అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన ఈ వివాహ వేడుక‌లో 251 మంది అమ్మాయిల‌కు పెళ్లి చేసిన స‌వానీ... అందుకు అయిన మొత్తం ఖ‌ర్చును తానే భ‌రించేశారు. ఇలా తండ్రి లేని అమ్మాయిలు అంటే... ఏదో హిందూ మ‌తానికి చెందిన అమ్మాయిల‌కే స‌వానీ పెళ్లి చేస్తున్నారులే అనుకోవ‌డానికి కూడా వీల్లేదు.

ఎందుకంటే ఆదివారం స‌వానీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన సామూహిక వివాహాల్లో మెజారిటీ అమ్మాయిలు హిందువులే అయినా... ఓ ఐదుగురు ముస్లిం - ఓ క్రిస్టియ‌న్ అమ్మాయి కూడా ఉన్నార‌ట‌. కుల మ‌తాల‌తో ప‌ని లేకుండా త‌మ కూతుళ్ల‌కు పెళ్లిళ్లు చేయ‌డానికి స్తోమ‌త లేక‌ - కుటుంబ పోష‌ణ బాధ్య‌త చూడాల్సిన మ‌గ దిక్కు లేని కుటుంబాల‌కు చెందిన అమ్మాయిలెవ‌రైనా... స‌వానీ కంట బ‌డితే... వారి పెళ్లి అయిపోయిన‌ట్టేన‌ట‌. అంతేకాదండోయ్‌... ఆయా కుటుంబాలు ఏ మ‌తానికి చెందిన‌వైతే... సామూహిక వివాహాలు జ‌రిపించినా కూడా వారి మ‌తానుచార‌మే పెళ్లిళ్లు చేయ‌డం ఈ బిజినెస్ మ్యాన్ ప్ర‌త్యేక‌త‌గా చెప్పుకుంటారు. గ‌డ‌చిన ఐదేళ్లుగా ఇదే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న స‌వానీ... మొన్న‌టి 251 మంది అమ్మాయిల‌తో క‌లిపి ఇప్ప‌టిదాకా వెయ్యి మంది అమ్మాయిల‌కు పెళ్లిళ్లు చేసి శ‌భాష్ అనిపించుకున్నారు.