Begin typing your search above and press return to search.

ఇండియాలో 26% మందికి కరోనా సోకిందట ..థైరోకేర్ అధ్యయనం

By:  Tupaki Desk   |   21 Aug 2020 2:30 AM GMT
ఇండియాలో  26% మందికి కరోనా సోకిందట ..థైరోకేర్ అధ్యయనం
X
భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు కరోనా మహమ్మారి బారిన పడి ఉంటారని ఓ ప్రయివేట్ ల్యాబ్ అంచనా వేస్తుంది. ఇప్పటి వరకూ చేసిన కరోనా పరీక్షల్లో 28 లక్షల మందికి కరోనా మహమ్మారి సోకినట్టు నిర్ధారణ కాగా.. కరోనా సోకిన వారి సంఖ్య అంతకంటే చాలా ఎక్కువని థైరోకేర్ అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2.7 లక్షల యాంటీబాడీలను విశ్లేషించిన థైరోకేర్.. 26 శాతం మందిలో యాంటీబాడీలను గుర్తించినట్లు స్పష్టం చేసింది. ఇన్ఫెక్షన్ బారిన పడి కోలుకున్నవారిలోనే యాంటీబాడీలు ఏర్పడతాయి. మేం అంచనా వేసిన దాని కంటే ఎక్కువ మందిలో యాంటీ బాడీలు కనిపించాయని డాక్టర్ ఎ. వేలుమణి తెలిపారు. చిన్నారులతో సహా అన్ని వయసుల వారిలోనూ యాంటీబాడీలు ఉన్నాయని ఆయన తెలిపారు.

ముంబై నగరంలోని మురికి వాడల్లో 57 శాతం మందికి కరోనా సోకి తగ్గిపోయిందని ప్రభుత్వ సర్వేలో తేలిన సంగతి తెలిసిందే. దేశంలోని 600 పట్టణాల్లో గత ఏడు వారాలపాటు థైరోకేర్ సర్వే చేపట్టిందని వేలుమణి వెల్లడించారు. ఇదే ట్రెండ్ కొనసాగితే డిసెంబర్ చివరి నాటికి మన దేశంలో 40 శాతం మందిలో యాంటీబాడీలు ఉంటాయని అయన తెలిపారు. హైదరాబాద్ నగరంలో 6.6 లక్షల మందికి కరోనా వచ్చి పోయిందని సీసీఎంబీ - సీఎస్ ‌ఐఆర్‌ సంయుక్త అధ్యయనంలో తేలింది. విజయవాడలోనూ 40 శాతం మందికిపైగా కోవిడ్ బారిన పడ్డారని సిరో సర్వైలెన్స్ ‌‌లో తేలింది. దీన్ని బట్టి చూస్తుంటే కరోనా మహమ్మారి సోకింది అని నిర్దారించినవారి కంటే ..కరోనా సోకింది అని తెలియకుండా సోకి తగ్గిపోయిన వారే అధికంగా ఉన్నట్టు తెలుస్తుంది.