Begin typing your search above and press return to search.

అంత విషాదంలోనూ ఏ సీఎం చేయలేని సాహసం చేశారుగా?

By:  Tupaki Desk   |   12 May 2021 2:30 AM GMT
అంత విషాదంలోనూ ఏ సీఎం చేయలేని సాహసం చేశారుగా?
X
ఒక ఘోరం చోటు చేసుకున్నప్పడు.. ఒక దారుణం జరిగినప్పుడు.. అనూహ్య పరిణామం ఏర్పడినప్పుడు.. ప్రజలకు ధైర్యం చెప్పటానికి.. నేనున్నాన్న సందేశం ఇవ్వటానికి ముఖ్యమంత్రులు వెను వెంటనే రంగంలోకి దిగుతారు. కరోనా నేపథ్యంలో అలాంటి వాటికి దూరంగా ఉంటున్నారు. ఆ మాటకు వస్తే.. తమ సౌదాలకు పరిమితమవుతున్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో.. లేదంటే అతి కీలకమైన అధికారులతో భేటీలని నిర్వహిస్తున్నారు. తాము చేసిన పనుల గురించి గొప్పగా చెప్పుకోవటానికి పటిష్టమైన పీఆర్వో వ్యవస్థను పెట్టుకోవటం ద్వారా బండి లాగిస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని పరిశీలించే వారంతా ఇలాంటి వాటిని తీవ్రంగా తప్పు పడుతున్నారు.

మరెలా ఉండాలేంటన్న ప్రశ్న కొందరిలో వస్తోంది. అలాంటి వారికి గోవాలో జరిగిన ఉదంతాన్ని.. దానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన తీరు చూసినప్పుడు.. గడిచిన రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న విషాద ఉదంతాలు ఇట్టే గుర్తుకు వస్తాయి. ఆ సందర్భంగా బాధితులకు భరోసా కలిగించేలా.. వారిలో మనో ధైర్యం మరింత పెంచేలా వ్యవహరిస్తే బాగుండేదన్న భావన కలగటం ఖాయం.

ఇంతకీ గోవాలో ఏం జరిగిందంటారా? గోవా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 26 మంది మరణించారు. వారంతా కరోనా రోగులే. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఈ దారునం చోటు చేసుకుంది. ఎందుకిలా జిరగిందన్న విషయంపై ఎవరూ క్లారిటీగా చెప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ఆసుపత్రికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెళ్లారు. మెడికల్ ఆక్సిజన్ లభ్యత విషయంలో చోటు చేసుకున్న అవాంతరం వల్లనే ఇలాంటి జరిగి ఉండొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఈ ఉదంతంపై హైకోర్టు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇక్కడ చెప్పేదేమంటే... ఇలాంటి విషాద ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు గోవా సీఎం మాదిరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధితుల వద్దకు వెళ్లి ఓదార్పు పలకొచ్చు కదా? ఆదివారం హైదరాబాద్ కింగ్ కోఠిలో... సోమవారం తిరుపతి రుయా ఆసుపత్రిలో.. ఐదుగురు.. పదకొండు మంది ఆక్సిజన్ అందక మరణించటాన్ని మర్చిపోలేం. కనీసం.. ఏపీ ముఖ్యమంత్రి రుయా బాధితులకు రూ.10లక్షల పరిహారం ప్రకటించగా.. కింగ్ కోఠి బాధితుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం పరిహార ప్రకటన కూడా రాకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.