Begin typing your search above and press return to search.

ముంబై బ్లాస్ట్ నిందితుడిపై..అమెరికాలో దాడి

By:  Tupaki Desk   |   24 July 2018 8:49 AM GMT
ముంబై బ్లాస్ట్ నిందితుడిపై..అమెరికాలో దాడి
X
ముంబై ఉగ్రదాడుల నిందితుడు - ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ మ‌రోమారు అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వచ్చాడు.పాకిస్థాన్‌ కు చెందిన డేవిడ్ హెడ్లీ.. ఆ దేశానికి చెందిన లష్కరే తోబయిబా ఉగ్రసంస్థతో పనిచేశాడు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడి కేసులో 2009లో హెడ్లీని అరెస్టు చేయ‌గా అమెరికా కోర్టు అతనికి 35 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అమెరికా జైలులో శిక్షను అనుభవిస్తున్న హెడ్లీపై తోటి ఖైదీలు దాడి చేశారు. ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని అమెరికా మీడియా సంస్థ‌లు వెల్ల‌డించాయి.

పాకిస్తాన్ సంతతికి చెందిన డేవిడ్ హెడ్లే అమెరికావాసి. అమెరికా డ్రగ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారిగా ఎప్పుడూ పాక్ వచ్చేవాడు. అదే సమయంలో హెడ్లీకి లష్కరే తోయిబాతో పరిచయం ఏర్పడింది. తర్వాత లష్కరే దగ్గర టెర్రరిస్టు ట్రైనింగ్ తీసుకున్న హెడ్లీ.. ముంబైలో దాడి చేసేందుకు రహస్య ఏజెంటుగా పనిచేశాడు. రెక్కీలు నిర్వహించడంలోనూ సాయం చేశాడు. 168 మంది ప్రాణాలు తీసుకున్న ముంబై ఘటనకు సూత్రధారిగా నిలిచాడు. 2009 అక్టోబర్‌లో షికాగోలోని ఓహేర్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టునుంచి పాకిస్తాన్‌ కు వెళ్తుండగా హెడ్లీని పోలీసులు అరెస్టు చేశారు. 2013లో అమెరికా కోర్టు ముంబై దాడుల కేసులోనే ఈయనకు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటినుంచి ఈ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, జూలై 8వ తేదీన డిటెన్షన్ సెంటర్‌లో హెడ్లీపై అటాక్ జరిగింది. తోటి ఖైదీలు తీవ్రంగా గాయ‌ప‌ర్చ‌డంతో దాడిలో తీవ్రంగా గాయపడ్డ హెడ్లీని ఇవాన్‌ స్టన్ హాస్పటల్‌ కు తీసుకువెళ్లారు. ప్ర‌స్తుతం అత‌ను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. హెడ్లీపై దాడి జరిగిన అంశం గురించి తమకు సమాచారం తెలియదని చికాగో కోర్టు పేర్కొంది.

కాగా, డేవిడ్ హెడ్లీని ముంబై దాడుల కేసులో వీడియో లింక్ ద్వారా విచారించిన సమ‌యంలో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. శివసేన చీఫ్ బాల్ థాకరేను హతమార్చాలని అప్పట్లో ప్లాన్ వేసినట్లు డేవిడ్ హెడ్లీ తెలిపారు. లష్కరే ఉగ్రవాది సాజిద్ మీర్ ఆదేశాల మేరుకు థాకరేను చంపాలనుకున్నట్లు హెడ్లీ తెలిపాడు. థాకరేను చంపేందుకు రెక్కీ వేయాలనుకున్నాం, దాని కోసం రెండు సార్లు శివసేన భవన్‌కు వెళ్లినట్లు హెడ్లీ కోర్టుకు తెలిపాడు. శివసేన నేతపై లష్కరే హత్యా ప్రయత్నాలు చేసిందని హెడ్లీ స్పష్టం చేశాడు. అమెరికా కోర్టులో క్షమాపణ కోరలేదని, ముంబై కోర్టులో మాత్రం గతంలో క్షమించమని అభ్యర్థన చేసినట్లు హెడ్లీ చెప్పాడు. ముంబై కోర్టుకు సత్యాలను వెల్లడించినంత మాత్రన తనకు అమెరికా కోర్టులో రక్షణ దొరకదన్నాడు. పేరు మార్పు కోసం అమెరికా పాస్‌ పోర్ట్ అధికారులకు ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ఇవ్వలేదన్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్-ఖయిదాకు కూడా పనిచేసినట్లు హెడ్లీ స్పష్టం చేశాడు. ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీపై గతంలో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ముంబై దాడులను సక్సెస్‌ఫుల్‌గా చేపట్టినందుకు తనను మెచ్చుకుంటూ తన భార్య ఈ-మెయిల్ పంపినట్లు తెలిపాడు. 2008 నవంబర్ 28న తనకు ఆ మెయిల్ వచ్చిందన్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు కంగ్రాట్స్. సంబరాలు ఘనంగా జరిగాయని త‌న భార్య‌ ఫైజా మెయిల్ చేసిందని హెడ్లీ అన్నాడు.