Begin typing your search above and press return to search.

అగ్రిగోల్డ్ బాధితులకు 264కోట్లు.. ఏపీ సర్కార్ విడుదల

By:  Tupaki Desk   |   19 Oct 2019 7:22 AM GMT
అగ్రిగోల్డ్ బాధితులకు 264కోట్లు.. ఏపీ సర్కార్ విడుదల
X
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు తీర్చాడు. ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ అగ్రిగోల్డ్ విషయంలో మరో భారీ ముందడుగు వేశాడు.

అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొన్నటి ఎన్నికల వేళ వైఎస్ జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నారు.

తాజాగా అగ్రిగోల్డ్ బాధితులకు రూ.264.99 కోట్లు విడుదల చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని 13 జిల్లాలకు అందజేసింది. రూ.10వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

టీడీపీ ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ స్కాంలో నిందితులకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలిచిందన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించి అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచారు. సీఎంగా అయితే వారిని ఆదుకుంటానని మాట ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు బడ్జెట్ లో రూ.1150 కోట్లు జగన్ కేటాయించారు.

ఆ 1150 కోట్లలో తొలివిడతగా జగన్ సర్కారు 264.99 కోట్లను తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలోని 3,69,655 మందికి వీటిని అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్లు, లీగల్ సెల్ అథారిటీ చైర్మన్లు కలిసి రూ.10వేల లోపు డిపాజిటర్లకు మొదట ఈ 264.99 కోట్లను పంపిణీ చేస్తారు.

ఇక ఈ పంపిణీ తర్వాత రూ.20వేల డిపాజిట్లకు సంబంధించి ఎంత మంది బాధితులు ఉన్నారు? ఎంత సొమ్ము విడుదల చేయాలనేదానిపై ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. ఏపీ ప్రభుత్వం ఎంతో ఆర్థిక ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితుల కోసం నిధులు విడుదల చేసి వారి అభిమానాన్ని చూరగొన్నారు.అన్న మాటను నిలబెట్టుకున్నారు.