Begin typing your search above and press return to search.

రాజమండ్రి: ఈ కన్నీళ్లు కొత్తవి కావు !

By:  Tupaki Desk   |   14 July 2015 12:24 PM GMT
రాజమండ్రి: ఈ కన్నీళ్లు కొత్తవి కావు !
X
భారతదేశం సంప్రదాయాలకు, ఆచారాలకు, నమ్మకాలకు, భక్తిభావానికి ప్రాధాన్యమిచ్చే దేశం. ఇక్కడి ప్రజలకు దైవభక్తి, పాపభీతి ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఆలయాలు, జాతరలకు వెళ్లడమే కాదు.. మేళాలు, పుష్కరాలు, తీర్థయాత్రలు ఇలా పేర్లు మారినా భక్తే పరమార్థంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్నికొన్ని ఆయా ప్రాంతాలకే పరిమితం కాగా కొన్నికొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దేశవ్యాప్త ప్రాధాన్యం ఉంటుంది... దేశవిదేశాల నుంచి వాటికి హాజరవుతుంటారు. లక్షలు, కోట్ల మంది పాల్గొనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు భారత్ లో జరుగుతుంటాయి.

కుంభమేళా, గోదావరి పుష్కరాలు, సమ్మక్క సారలమ్మ జాతర, అమరనాథ్ యాత్ర వంటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎంతో వేడుకగా జరిగే ఇలాంటి కార్యక్రమాలకు ఒక్కోసారి అనుకోకుండా విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ప్రధానంగా లక్షల మంది ఒకే చోట చేరడంతో తొక్కిసలాటలు జరుగుతుంటాయి. ఆ తొక్కిసలాటల్లో భక్తుల ప్రాణాలు పోయిన సంఘటనలు అనేకం. తాజాగా గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 27 మంది మృతిచెందిన నేపథ్యంతో దేశంలో పెను విషాదాన్ని మిగిల్చిన కొన్ని తొక్కిసలాట సంఘటనల వివరాలివీ..

* 1954 ఫిబ్రవరి 3న అలహాబాద్ లో కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 800 మందికిపైగా మరణించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన తొలి కుంభమేళా అది. ఆ ఏడాది కుంభమేళాకు 50 లక్షల మంది హాజరయ్యారని అంచనా.
* 1996 జులై 15న ఉజ్జయినిలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది అదే రోజు హరిద్వార్ లో తొక్కిసలాట జరిగి 21 మంది మృత్యువాతపడ్డారు.
* 1999 జనవరి 14న మకరజ్యోతి సందర్బంగా శబరిమలలో తొక్కిసలాట జరిగి 53 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
* 2003లో అలహాబాద్ కుంభమేళాలో నాసిక్ వద్ద తొక్కిసలాట జరిగి 40 మంది మరణించారు.
* 2006 ఆగస్టు 3న హిమాచల్ ప్రదేశ్ లోని నయనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 160 మంది మరణించారు.
* 2008 జులైలో పూరీలో జగన్నాథ రథయాత్ర సమయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరనించారు.
* 2008 సెప్టెంబరు 30న రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో చాముండిదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 224 మంది మరణించారు.
* 2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్ లో ప్రతాప్ గఢ్ లో రామ్ జానకి ఆలయంలో తొక్కిసలాటలో 63 మంది చనిపోయారు.
* 2011 జనవరి 14న మకరజ్యోతికి శబరిమలలో తొక్కిసలాట జరిగి 106 మంది అయ్యప్ప భక్తులు మృతిచెందారు.
* 2012 సెప్టెంబరు 24న జార్ఖండ్ లో ఒక ఆశ్రమంలో 9 మంది మరణించారు.
* 2013 ఫిబ్రవరి 10న అలహాబాద్ లో కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 36 మంది మరణించారు.
* 2013 అక్టోబరు 13న దసరా సమయంలో మధ్యప్రదేశ్ లో రత్నగిరి మఠం ఆలయంలో తొక్కిసలాటలో 115 మంది ప్రాణాలు కోల్పోయారు.
* 2014 జనవరి 18న ముంబయిలో ఆధ్యాత్మిక గురువు సయ్యద్ మొహమ్మద్ బుర్భనుద్దీన్ చివరిచూపుల కోసం వచ్చిన భక్తులు 18 మంది ద అక్కడ జరిగినతొక్కిసలాటలో మరణించారు. ఆయన 17న మరణించగా ప్రజల సందర్శనార్థం ఉంచిన మృతదేహాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది.
* 2014 అక్టోబరు 3న పాట్నాలో దసరా సందర్భంగా ప్రజలంతా ఒకచోట చేరినప్పుడు తొక్కిసలాట జరిగి 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
... ఇవన్నీ ఆధ్మాత్మిక కార్యక్రమాలు, ఆలయాల్లో జరిగిన సంఘటనలు కాగా కొన్ని ఇతర సందర్బాల్లోనూ తొక్కిసలాటలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి.
- 1994లో మహారాష్ట్రలోని నాగపూర్ లో గొవారీ తెగకు చెందిన వారు ఉద్యమించగా పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో వారంతా పరుగులు తీసిన క్రమంలో తొక్కిసలాట జరిగింది. అందులో 114మంది మరణించారు
- 2005 నవంబరులో చెన్నైలో ఒక పాఠశాలలో వరద బాధితులకు సహాయం పంపిణీ చేస్తున్నప్పుడు తొక్కిసలాట జరిగి 6గురు చనిపోయారు.
- 2005 డిసెంబరులో చెన్నైలోనే పాఠశాలలో వరద బాధితులకు సహాయం పంపిణీ చేస్తున్నప్పుడు తొక్కిసలాట జరిగి 42 మంది మృతిచెందారు.

----- గరుడ