Begin typing your search above and press return to search.

మహమ్మారి పై నిర్ల‌క్ష్యం ఖ‌రీదు కుటుంబాలు కుటుంబాలు బ‌లి

By:  Tupaki Desk   |   18 May 2020 7:50 AM GMT
మహమ్మారి పై నిర్ల‌క్ష్యం ఖ‌రీదు కుటుంబాలు కుటుంబాలు బ‌లి
X
మహమ్మారి వైర‌స్‌ పై నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. మాస్క్‌లు ధ‌రించ‌డం.. శానిటైజ‌ర్‌తో చేతులు నిరంత‌రం శుభ్రం చేసుకోవ‌డం.. భౌతిక దూరం పాటించాల‌ని.. అనారోగ్యానికి గుర‌యితే ఆస్ప‌త్రికి వెళ్లాల‌ని ప్ర‌భుత్వాలు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నాయి. అయినా ప్ర‌జ‌ల్లో మార్పు రావ‌డం లేదు. మహమ్మారి వైర‌స్‌ పై నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో కుటుంబాలు.. కుటుంబాలు ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. వీరిలో కొంద‌రు మృత్యువాత చెందుతుండ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. జీహెచ్ఎంసీ ప‌రిధిలో న‌మోద‌వుతున్న కేసుల్లో మొత్తం అలాంటి సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. వ‌నస్థలిపురం, మంగ‌ళ్‌హాట్‌, మాద‌న్న‌పేట‌లో వెలుగు చూసిన మహమ్మారి కేసుల్లో ఇదే నేప‌థ్యం ఉంది. అయితే వీటిలో ఆశ్చ‌ర్య‌ పోయే విష‌యాలు ఉన్నాయి. మహమ్మారి సోకిన వ్య‌క్తి నుంచి వారి పిల్ల‌ల‌కు వ్యాపించ‌గా ఆ పిల్లల నుంచి ఇంట్లోని వృద్ధుల‌కు సోకుతోంది. దీంతో మహమ్మారి బారిన ప‌డి ఇంట్లోనే పెద్ద‌వాళ్లు మృతి చెందిన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంది.

వ‌న‌స్థ‌లిపురంలో పుట్టిన రోజు వేడుక నిర్వ‌హించారు. ఆ వేడుక‌కు హాజరైన 27 మంది వైరస్‌ బారినపడ్డారు. వారిలో పిల్లలతో పాటు వృద్ధులు, ఇతర కుటుంబసభ్యులంతా ఉన్నారు. మహమ్మారితో ఆస్పత్రిలో చేరుతుండటం, ఒక్కొక్కరూ ఒక్కో వార్డులో అనాథల్లా ఉండిపోవాల్సి రావడం, బాధితుల్లో ఎవరైనా చనిపోతే.. కనీసం వారిని కడసారి చూసేందుకు కూడా నోచుకోలేని దుస్థితి ఏర్ప‌డింది.

కుటుంబంలో ఒకరికి మహమ్మారి సోకినా కూడా ఆ ల‌క్ష‌ణాలు వెంట‌నే క‌నిపించ‌క‌ పోవ‌డంతో వారంతా వారి పిల్లలు, కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి జీవిస్తున్నారు. ఆక్ర‌మంలో పిల్ల‌లు, వారి ద్వారా ఇంట్లోని వృద్ధుల‌కు మహమ్మారి సోకుతుంది. తల్లిదండ్రుల ద్వారా వారి పిల్లలకు.. వారి నుంచి వృద్ధులకు వైరస్‌ సోకుతుంద‌ని వైద్యులు గుర్తించారు. వీరిలో అసింప్టమెటిక్, మైల్డ్‌ సింటమ్స్‌ (వైరస్‌ లక్షణాలు బయటికి కన్పించకపోవడం) ఉండడంతో వైరస్ సోకిన‌ట్లు వారికి తెలియడం లేదు. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. వారు అనారోగ్యం చెందిన‌ప్పుడు ఆస్ప‌త్రికి వెళ్లితే అప్పుడు మహమ్మారి బారిన ప‌డ్డార‌ని తెలుస్తోంది.

మహమ్మారి వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలో కొంద‌రు నిర్ల‌క్ష్యంగానే ఉన్నారు. ఎందుకంటే ఈ స‌మ‌యంలో కూడా కొంద‌రు పిల్లల పుట్టిన రోజు, వివాహ వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూనే ఉన్నారు. ఆ వేడుకలే అంద‌రి కొంప‌ముంచుతున్నాయి. ఎంతో అట్టహాసంగా చేస్తున్నారు. బంధువులు, ఇరుగు పొరుగున ఉన్న సన్నిహితులను వేడుకలకు ఆహ్వానిస్తున్నారు. వారి ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉండటంతో వారు కూడా వెళ్లి వస్తున్నారు. అప్పటికే ఇంట్లోని వ్యక్తులకు వైరస్‌ ఉండటం, లక్షణాలు బయటపడకపోవడంతో తాము ఆరోగ్యంగా ఉన్నట్లు భావించి వేడుకలకు ఇతరులను ఆహ్వానించడం, అప్పటివరకు అంతర్లీనంగా దాగి ఉన్న వైరస్‌.. వేడుకలకు హాజరైన ఇతర పిల్లలకు విస్తరిస్తోంది. ఆ పిల్లల ద్వారా వారి ఇంట్లోని వృద్ధులకు విస్తరిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది.

సంతోశ్‌‌నగర్‌ మాదన్నపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుమార్తె బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఇక్కడి పిల్లలందరినీ వీటికి ఆహ్వానించారు. అపార్ట్‌మెంట్‌లోని 13 ప్లాట్స్‌లో 59 మంది వరకు ఉన్నారు. బర్త్‌డే బేబీ తండ్రికి మహమ్మారి వైరస్‌ సోకినట్లు ఈ నెల 9వ తేదీన నిర్ధారణ అయింది. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న 54 మందిని క్వారంటైన్‌ చేసి, పరీక్షలు చేయగా.. 39 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో గర్భిణి సహా వృద్ధులు కూడా ఉన్నట్లు తెలిసింది. పిల్లల ద్వారానే పెద్దలకు వైరస్‌ విస్తరించి ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. అంతకుముందు వనస్థలిపురం ఏ-క్వార్టర్స్‌లో ఉండే వ్యక్తి ఇటీవల ఇంట్లో తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. దీనికి హాజరైన సమీప బంధువులు, వారి డ్రైవర్, వంట మనిషి ఇలా మొత్తం 27 మంది వైరస్‌ బారిన పడాల్సి వచ్చింది.

ఈ విధంగా మహమ్మారి వైర‌స్ వ్యాప్తి చెందుతున్న స‌మ‌యంలో వేడుక‌లు చేసుకోవ‌డంతో ఆ మ‌హ‌మ్మారి సోకుతోంది. మ‌ల‌క్‌పేట గంజ్‌, స‌రూర్‌న‌గ‌ర్ కేసుల్లో కూడా ఇలాంటివే చోటుచేసుకున్నాయి. వాటి ద్వారానే పెద్ద సంఖ్య‌లో కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటిస్తే మీకు, మీ కుటుంబంతో పాటు స‌మాజానికి మేలు చేసిన వార‌వుతారు.