Begin typing your search above and press return to search.

భార్యతో వాదించలేక నాలుగు తెగ్గోసుకున్నాడు..

By:  Tupaki Desk   |   16 March 2021 5:07 AM GMT
భార్యతో వాదించలేక నాలుగు తెగ్గోసుకున్నాడు..
X
భార్య, భర్తల మధ్య గొడవలు సహజం. ప్రతి ఇంట్లోనూ ఇటువంటి తగాదాలు ఉంటాయి. ఉదయాన్నే గొడవపడటం.. మళ్లీ రాత్రికి ఒక్కటవ్వడం చాలా కుటుంబాల్లో జరుగుతూనే ఉంటుంది. మరికొన్ని కుటుంబాల్లో ఈ వివాదాలు ముదురుతాయి. భార్య భర్తలు గొడవలు విడాకుల వరకు దారితీసిన సందర్బాలు ఉంటాయి. ఇలా కుటుంబవ్యవహారాల్లో అనేక ఘటనలు జరుగుతుంటాయి. కానీ ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఓ ఘటన మాత్రం సంచలనంగా మారింది. భార్య పోరు పడలేక.. ఓ భర్త తన నాలుకను కోసుకున్నాడు. భార్యతో వాదించలేక ఏకంగా బ్లేడుతో నాలుకను తెగ్గోసుకున్నాడు.

యూపీ రాష్ట్రం కాన్పూర్​లోని గోపాల్​పూర్​లో ముఖేశ్​ అతడి భార్య నిషా.. ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల భార్య భర్తల మధ్య ఏదో చిన్న పాటి గొడవ జరిగింది. భార్య, భర్తలిద్దరూ మాటా మాటా అనుకున్నారు. ఆ తర్వాత భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ముఖేశ్​ తీవ్ర అసహనానికి గురయ్యాడు. పుట్టింటికి రావాలంటూ భార్యకు తరచూ ఫోన్​ చేస్తున్నాడు. కానీ అందుకు ఆమె మాత్రం నిరాకరిస్తున్నది. తాజాగా మరోసారి ఫోన్​ చేశాడు. పుట్టింటికి రావాలంటూ కోరాడు. కానీ నిషా మాత్రం అతడితో వాగ్వాదానికి దిగింది. తప్పంతా ముఖేశ్​దే అన్నట్టు మాట్లాడింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ముఖేశ్​ బ్లేడ్​తో తన నాలుకను కోసేసుకున్నాడు. అక్కడే ఉన్న కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన యూపీలో సంచలనంగా మారింది. ఈ వార్త సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ఎంత కోపం ఉంటే మాత్రం మరి ఇంతలా నాలుక కోసుకోవాలా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో భార్య తీరును తప్పుపడుతున్నారు. అంత కఠినంగా ఉండటం సరికాదంటూ సూచిస్తున్నారు. మరోవైపు ముఖేశ్​కు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందుతున్నది. అతడు కోలుకుంటున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. ఆవేశంలో ఏకంగా నాలుక కోసుకోవడం ఏమిటని పలువురు ఆశ్చర్యపోతున్నారు.