Begin typing your search above and press return to search.

షాకింగ్.. విదేశాల్లో ఉన్న మనోళ్లలో అంతమందికి కరోనా

By:  Tupaki Desk   |   18 March 2020 12:00 PM GMT
షాకింగ్.. విదేశాల్లో ఉన్న మనోళ్లలో అంతమందికి కరోనా
X
ఇప్పటికిప్పుడు మన దేశంలో కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో ఉన్న వారెంతమంది అంటే? 130 మంది మాత్రమే. మరి.. 147 మంది చెబుతున్నారు కదా? అంటే.. ఇప్పటివరకూ నమోదైన కేసుల్ని.. మరణాల్ని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారిని కలిపి చెప్పటం కారణంగా ఈ సంఖ్యలో తేడా కనిపిస్తూ ఉంటుంది. దేశం మొత్తమ్మీదా ఉన్న కరోనా కేసులతో పోలిస్తే.. విదేశాల్లో ఉన్న మనోళ్లలో కరోనా బారిన పడిన వారి సంఖ్య భారీగా ఉన్న షాకింగ్ నిజాన్ని తాజాగా కేంద్రం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా ప్రభావం తో 8వేల మంది మరణిస్తే.. మన దేశంలో ముగ్గురు మాత్రమే మరణించారు.

ఇదిలా ఉంటే.. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో కరోనా బారిన పడిన వారి వివరాల్ని కేంద్రం రివీల్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో 276 మంది కరోనా బారిన పడ్డారని.. అందులో ఒక్క ఇరాన్ లోనే మనోళ్లు 255 మంది ఉన్నట్లు చెప్పింది. యూఏఈ లో పన్నెండు మంది.. ఇటలీలో ఐదుగురు..కువైట్.. రువాండా.. శ్రీలంక.. హాంగ్ కాంగ్ లో ఒకరు చొప్పున కరోనా బారిన పడినట్లు వెల్లడించింది.

తాజాగా లోక్ సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్రం బదులిస్తూ.. ఈ సమాచారాన్ని విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందగా.. దాదాపు 2 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. మిగిలిన దేశాలతోపోలిస్తే.. మన దేశంలో కరోనా ప్రభావం అంతగా లేదనే చెప్పాలి. కేంద్రం తో పాటు.. వివిధ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండటం తో కరోనా ముప్పు మనకు పెద్దగా లేదు. కానీ.. విదేశాల్లోని మనోళ్లు ఇంత భారీగా కరోనా బారిన పడటంఆందోళన కలిగించే అంశం. ఇరాన్ లోని మనోళ్లు ఇంత భారీగా వైరస్ బారిన పడటం షాకింగ్ గా మారింది.

దేశంలోని 130 కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర.. కేరళ.. హర్యానా.. ఉత్తరప్రదేశ్ లోనే సింహభాగం కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే కలిపి.. వంద పాజిటివ్ కేసులు ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో పది పాజిటివ్ కేసులు ఉన్నాయి. అంటే.. దేశంలోని ఐదు రాష్ట్రాల్లోనే 80 శాతానికి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు చెబుతున్నారు.