Begin typing your search above and press return to search.

ఇండియాలో ఇక 28 రాష్ట్రాలు.. 9 కేంద్రపాలిత ప్రాంతాలు

By:  Tupaki Desk   |   5 Aug 2019 11:27 AM GMT
ఇండియాలో ఇక 28 రాష్ట్రాలు.. 9 కేంద్రపాలిత ప్రాంతాలు
X
మోదీ ప్రభుత్వ తాజా నిర్ణయమైన జమ్ముకశ్మీర్ విభజనతో దేశ రాజకీయ చిత్రపటం మారబోతోంది. దేశంలో రాష్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య మారబోతోంది. ప్రస్తుతం 29 రాష్ట్రాలు ఉండగా ఆ సంఖ్య 28కి చేరబోతోంది. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరనుంది.

జూన్‌ 2, 2014న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అప్పటి వరకు 28 రాష్ట్రాలుగా ఉన్నవి 29కి పెరిగాయి. ఇప్పుడు మళ్లీ ఆ సంఖ్య 28కే చేరింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈరోజు రాజ్యసభలో ప్రకటించారు. జమ్ము-కశ్మీర్‌ చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లద్దాఖ్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు కానున్నాయి. రెండు ప్రాంతాలకు ప్రత్యేక లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఉండనున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రాల సంఖ్య 28కి చేరగా.. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది.

కశ్మీర్‌ లో ఇంతవరకు 22 జిల్లాలు ఉండేవి. వాటిని జమ్ము- కశ్మీర్‌- లద్దాఖ్‌ రీజియన్లుగా వ్యవహరించేవారు. కాగా, జమ్ములో 10 జిల్లాలు, కశ్మీర్‌లో 10, లద్దాఖ్‌లో రెండు జిల్లాలు ఉండేవి. తాజా కేంద్రం నిర్ణయంతో లెహ్‌- కార్గిల్‌ జిల్లాలతో కూడిన లద్దాఖ్‌ రీజియన్‌ చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. పది జిల్లాలతో కూడిన కశ్మీర్‌ ను మరో పది జిల్లాలతో కూడిన జమ్ముతో కలిపి చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది.. అప్పటి నుంచి తెలంగాణను దేశంలో 29వ రాష్ట్రంగా వ్యవహరించేవారు. కానీ.. ఇప్పుడు 29వ రాష్ట్రం తెలంగాణ అనడం సాంకేతికంగా వీలుకాదు.