Begin typing your search above and press return to search.

దోపిడీయత్నమా? దీదీ మార్కు ప్రతీకారమా?

By:  Tupaki Desk   |   20 Jan 2015 6:50 AM GMT
దోపిడీయత్నమా? దీదీ మార్కు ప్రతీకారమా?
X


దోపిడీ దొంగల ముఠా అంటే సాధారణంగా లైక్‌ మైండెడ్‌ పీపుల్‌ అయి ఉండాలి. కానీ వారందరూ ఒకే రాజకీయ పార్టీ కార్యకర్తలుగా ఉంటారనుకోవడం భ్రమ. కానీ.. ఒకే పార్టీకి.. ఒకే ప్రాంతానికి చెందిన 29 మంది.. దోపిడీదొంగతనాలకు ప్లాన్‌ చేస్తున్నారంటూ జరిగిన అరెస్టులు ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లో రకరకాల అనుమానాలకు దారి తీస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో మమతా దీదీకి భారతీయజనతా పార్టీ సరైన నిద్ర లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యానికి కొన్ని స్థానిక కారణాలు కూడా జత కావడంతో.. భాజపాకు చెందిన 29 మందిని.. దోపిడీలకు పథక రచన చేస్తున్నారనే నెపం మీద పోలీసులు అరెస్టు చేయడం.. దోపిడీకి అనువుగా ఆయుధాలు కలిగిఉన్నారని.. కేసులు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇది ముఖ్యమంత్రి మమతాదీదీ మార్కు ప్రతీకారం కావచ్చునని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నపూర్‌ జిల్లాలోని నయాగ్రాం భాజపా అధ్యక్షుడు సుఖేందుపాత్ర, జిల్లా పార్టీ సభ్యుడు అర్ధేందు పాత్ర.. వీరితో పాటు మరో 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ కలిసి ఆయుధాలు, పేలుడుకు అవసరమైన మందుగుండు సామగ్రిఉంచుకుని దోపిడీలు ప్లాన్‌ చేస్తున్నారని కేసులు పెట్టి రిమాండుకు తరలించారు. ఇదంతా బాగానే ఉంది. ఒకే పార్టీ వారు మూకుమ్మడిగా.. అదేదో పార్టీ కార్యక్రమం అన్నట్లుగా దోపిడీ యత్నం కేసులో చిక్కుకోవడమే తమాషా.

కాకపోతే.. భాజపా వాదన ఎలా ఉన్నదంటే.. తమ పార్టీ కార్యకర్తను తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వారు చితక్కొట్టడంతో పైన చెప్పిన నాయకులంతా కలిసి అతణ్ని ఆస్పత్రిలో చేర్పించి తిరిగి వస్తుండగా.. ఈ అరెస్టులు జరిగాయిట. రాజకీయ దొమ్మీలు చాలా సహజమైన పశ్చిమబెంగాల్‌లో.. తమ కార్యకర్తను కొట్టారు గనుక.. వీరు ప్రతిదాడులకు గానీ.. లేదా ఆత్మరక్షణకు గానీ.. ఆయుధాలతోనే వెళుతుండవచ్చు. ఆ సమయంలో పోలీసులు పట్టుకున్నారు. కానీ.. తమాషాగా వారిమీద దోపిడీయత్నం కేసులు పెట్టారు. ఈ కేసులను కుట్రపూరితంగా బనాయించారని భాజపా నాయకులు వాదిస్తున్నారు.

అసలే శారదా చిట్స్‌ కుంభకోణంలో మునిగి ఉన్న మమతా దీదీ.. ప్రత్యర్థి భాజపా మీద కూడా ఎలాగోలా బురద పులమడానికి ఇలాంటి దోపిడీ కేసులతో వ్యూహరచన చేస్తున్నదా అని అనుకుంటున్నారు.