Begin typing your search above and press return to search.

పెద్దాయ‌న‌కు ఈ రోజు త‌గిలే షాకులెన్ని?

By:  Tupaki Desk   |   21 Dec 2017 3:20 AM GMT
పెద్దాయ‌న‌కు ఈ రోజు త‌గిలే షాకులెన్ని?
X
కొద్దిరోజుల క్రితం రాజ‌కీయంగా ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టం గుర్తుందా? త‌న కార్యాల‌యంలో ప‌ని చేసే సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో జ‌రిగే వివాహానికి హాజ‌ర‌య్యేందుకు త‌మిళ‌నాడుకు వెళ్ల‌టం.. ఆ సంద‌ర్భంగా చెన్నైలో ఒక మీడియా సంస్థ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి వెళ్ల‌ట‌మే కాదు.. డీఎంకే అధినేత క‌రుణ ఇంటికి వెళ్లి.. ఆయ‌న చేతిని ప‌ట్టుకొన్న వైనాన్ని మ‌ర్చిపోలేం. ఆ సంద‌ర్భంగా మోడీ నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొనేలా చేశాయి.

అనారోగ్యంతో ఉన్న క‌రుణ‌ను త‌న ఇంటికి వ‌చ్చి విశ్రాంతి తీసుకోవాలంటూ ఆఫ‌రిచ్చారు. క‌న్న‌త‌ల్లిని ఇంట్లో పెట్టుకోని మోడీ.. క‌రుణ‌ను మాత్రం త‌న ఇంట్లో ఉంచుకోవాల‌నుకుంటున్నాడే... అంటూ ప‌లువురు ఎక్కెసం చేశారు. ఈ ఇష్యూను ఇక్క‌డ క‌ట్ చేస్తే.. ముదిమి వ‌య‌సులో ఉన్న డీఎంకే అధినేత‌.. పెద్దాయ‌న క‌రుణానిధి ఈ మ‌ధ్య కొంత‌కాలంగా తీవ్ర అనారోగ్యంగా ఉన్నారు. ఇలాంటి వేళ‌.. ఆయ‌న నేతృత్వం వ‌హించే పార్టీ క‌ఠిన‌మైన ప‌రీక్షను ఎదుర్కోవ‌టంతో పాటు.. వ్య‌క్తిగ‌తంగానే ఇబ్బందిక‌ర ప‌రిస్థిని ఎదుర్కొంటున్నారు.

ఒకే రోజు భారీ ప‌రీక్ష‌లు క‌రుణకు ఎదుర‌య్యాయ‌ని చెప్పాలి. అందులో మొద‌టిది అమ్మ మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు జ‌ర‌గ‌నుంది? ఈ ఎన్నిక ఫ‌లితం విప‌క్షంగా ఉన్న డీఎంకే మీద ప్ర‌భావాన్ని చూప‌టం ఖాయం. మ‌రోవైపు.. ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన 2జీ కుంభ‌కోణం కేసుల‌కు సంబంధించి సీబీఐ ప్ర‌త్యేక కోర్టు కీల‌క తీర్పు ఇవ్వ‌నుంది. ఈ కేసులో మాజీ కేంద్ర‌మంత్రి రాజాతో పాటు.. క‌రుణ కుమార్తె క‌నిమొళి త‌దిత‌రులు నిందితులుగా ఉన్నారు. కోర్టు తీర్పు నేప‌థ్యంలో వ్య‌క్తిగ‌తంగా వారు హాజ‌రు కావాలంటూ రాజా.. క‌నిమొళి త‌దిత‌రుల‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో కోర్టు తీర్పు రాజా.. క‌నిమొళికి వ్య‌తిరేకంగా వస్తే.. దాని ప్ర‌భావం ఈ రోజు జ‌రిగే పోలింగ్ మీద ప్ర‌భావం చూపించ‌టం ఖాయం.

దాదాపు రూ.1.76ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జాధ‌నానికి గండి ప‌డిందంటూ కాగ్ నివేదిక వెల్ల‌డించిన నేప‌థ్యంలో 2జీ స్కాం దేశంలో పెను ప్ర‌కంప‌న‌ల్ని సృష్టించింది. కొంత‌కాలం జైల్లో ఉన్న రాజా.. క‌నిమొళి త‌ర్వాతి కాలంలో బెయిల్ మీద విడుద‌ల‌య్యారు. తాజాగా ఇచ్చే తీర్పు క‌రుణ‌కు కొత్త క‌ష్టాన్ని తెస్తుందా? ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తుందా? అన్న‌ది తేల‌నుంది.