Begin typing your search above and press return to search.

3 రాజధానుల బిల్లు.. ఏపీ సభలో ఇవాళే పెట్టేయనున్నారా?

By:  Tupaki Desk   |   15 Sep 2022 5:19 AM GMT
3 రాజధానుల బిల్లు.. ఏపీ సభలో ఇవాళే పెట్టేయనున్నారా?
X
ఎవరేమన్నా.. ఎవరెన్ని అనుకున్నా.. గతంలో తాను ఇచ్చిన మాటను పక్కన పెట్టేసి.. వర్తమానంలో తాను అనుకున్న దాని కోసం మొండిగా వ్యవహరించే ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు.

ఏపీకి మూడు రాజధానులన్న కాన్సెప్టును తీసుకురావటమే కాదు.. గతంలో ఒకసారి ప్రయత్నం చేసి భంగపడిన వేళ.. తాజాగా మరోసారి అదే అంశాన్ని బిల్లు రూపంలో ఏపీ అసెంబ్లీలోకి ప్రవేశ పెట్టనున్న వైనం ఆసక్తికరంగా మారింది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా.. జగన్ సర్కారు తాజా నిర్ణయం ఉండటం గమనార్హం.

ఒకవైపు అమరావతి నుంచి అరసవెల్లి అంటూ ఒకటే రాజధాని కావాలంటూ రైతులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తున్న వేళ.. ఏపీ అసెంబ్లీ ఈ రోజు (గురువారం) కొలువు తీరనుంది. ఈ సమావేశాల్లో మొత్తం పాతిక అంశాల వరకు చర్చకు పెట్టనున్నట్లు చెబుతున్నారు.

జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న మూడురాజధానుల బిల్లును ఈ రోజే సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. గురువారం ఉదయం 9 గంటలకు మొదలయ్యే సమావేశాల్లో.. తొలి రోజునే మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెట్టటంతోపాటు.. ఈ అంశంపై కీలకమైన రాజకీయ ప్రకటనతో పాటు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

అయితే.. ఈ బిల్లును సభలో ప్రవేశ పెడతారా? లేదా? అనే దానిపై ఎవరూ పెదవి విప్పటం లేదు. పెద్ద ఎత్తున గోప్యతను పాటిస్తున్న ఈ అంశంపై అధికార పార్టీకి చెందిన కీలక నేతలు మాత్రం మూడు రాజధానులపై బిల్లు ఖాయమని స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానుల బిల్లును ఈ రోజు సాయంత్రం సభలో ప్రవేశ పెట్టే వీలుందన్న మాట వినిపిస్తోంది.

మూడు రాజధానుల బిల్లుకు సంబంధించిన అంశాన్ని వైసీపీ అసెంబ్లీ వ్యవహారాల వ్యూహ కమిటీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమై మరీ చర్చించినట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారరెడ్డితో భేటీ అయి సుదీర్ఘంగా సమీక్ష జరిపినట్లుగా తెలుస్తోంది. మరి.. అంచనాలకు తగ్గట్లు జగన్ మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెడతారా? లేదా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.