Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పై ఉగ్ర పిశాచాల కన్ను

By:  Tupaki Desk   |   26 Dec 2015 7:39 AM GMT
హైదరాబాద్ పై ఉగ్ర పిశాచాల కన్ను
X
నాగపూర్ లో మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు ముగ్గురు హైదరాబాద్ విద్యార్థులను అరెస్టు చేశారు. అక్కడ విచారణలో వారు చెప్పిన సంగతులు వింటే అమ్మో అనుకోక తప్పదు. అవును... పోలీసులకు దొరికిన ఆ ముగ్గురు స్టూడెంట్లు కూడా ప్రపంచంలో అతి భయానక ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్ లో చేరడానికి వెళ్తున్నారట. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల పోలీసు - నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. రిక్రూట్ మెంట్ల కోసం ఐఎస్ ఉగ్రవాదులు హైదరాబాద్ పై కన్నేశారని అనుమానిస్తున్నారు.

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులలో చేరడానికి వెళుతున్న హైదరాబాద్‌ కు చెందిన ముగ్గురు విద్యార్థులను మహారాష్ట్ర యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఎటిఎస్‌) అరెస్టు చేసింది. హైదరాబాద్‌ నుంచి నాగపూర్‌ కు రోడ్డు మార్గంలో వెళ్లిన వీరు అక్కడినుంచి శ్రీనగర్‌ వెళ్లడానికి విమానాశ్రయానికి వెళ్లగా పోలీసులు అరెస్టు చేశారు. 20 సంవత్సరాల వయస్సున్న వీరిని అబ్దుల్‌ వాసిమ్‌ - ఉమర్‌ హసన్‌ ఫరూఖీ - మాజ్‌ హసన్‌ ఫరూఖీగా గుర్తించారు. తమ పిల్లలు తప్పిపోయారని వీరి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇతర రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. పట్టుబడిన ముగ్గురు విద్యార్థులను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. ఐఎస్ లో చేరడానికి హైదరాబాద్ యువత వెళ్తుండడం ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది.