Begin typing your search above and press return to search.

మ‌నోళ్లు ముగ్గురు యూఎస్ ఎన్నిక‌ల్లో గెలిచారు

By:  Tupaki Desk   |   6 Sep 2018 5:15 AM GMT
మ‌నోళ్లు ముగ్గురు యూఎస్ ఎన్నిక‌ల్లో గెలిచారు
X
అమెరికా గ‌డ్డ‌పై మ‌నోళ్లు మ‌రోసారి త‌మ స‌త్తాను చాటారు.భార‌త మూలాలున్న ముగ్గురు అమెరికా ప్ర‌తినిధుల స‌భ‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ముగ్గురు భార‌త సంత‌తికి చెందిన అమెరిక‌న్లు ఆరిజోనా.. ఫ్లోరిడా రాష్ట్రాల్లో జ‌రిగిన ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా గెల‌వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆగ‌స్టు 31న ఆరిజోనా.. ఫ్లోరిడా రాష్ట్రాల్లో ప్రైమ‌రీ ఎన్నిక‌ల్నినిర్వ‌హించారు. ఆరిజోనా రాష్ట్రంలోని 8వ కాంగ్రెస్ స్థానం నుంచి తిపిర్నేని ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. మాలిక్ 6వ కాంగ్రెస్ లో ముగ్గురితో పోటీ ప‌డి విజ‌యం సాధించారు. ఫ్లోరిడాలోని 8వ కాంగ్రెస్ స్థానం నుంచి ప‌టేల్ ఏక‌గ్రీవంగా గెలుపొందారు. తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వీరు న‌వంబ‌రులో జ‌రిగే సాధార‌ణ ఎన్నిక‌ల్లో పోటీ ప‌డాల్సి ఉంటుంది.

మాలిక్ రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డేవిడ్ సావికెర్ట్ తో పోటీ ప‌డాల్సి ఉంటుంది. ఈ ఏడాది జ‌రిగిన ప్ర‌త్యేక ఎన్నిక‌ల్లో తిపిర్నేని రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డెబీ లెస్కో చేతిలో ఓడారు. వ‌చ్చే న‌వంబ‌రులో జ‌రిగే ఎన్నిక‌ల్లో మ‌రోసారి వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ జ‌ర‌గ‌నుంది.

ప్ర‌స్తుతం అమెరికా ప్ర‌తినిధుల స‌భ‌లో న‌లుగురు బార‌తీయ అమెరిక‌న్లు ఉన్నారు. అమెరికా కాంగ్రెస్ చ‌రిత్ర‌లో ఇంత‌మంది భార‌తీయులు ఎంపీలుగా ఉండ‌టం ఇదే తొలిసారి. ఆ న‌లుగురు ఎవ‌రంటే.. కాలిఫోర్నియా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అమిబెరా.. ఇల్లినాయిస్ నుంచి రాజా కృష్ణ‌మూర్తి.. వాషింగ్ట‌న్ నుంచి ప్ర‌మీల జ‌య‌పాల్‌.. కాలిఫోర్నియా నుంచి రో ఖ‌న్నాలు ఉన్నారు.

ఈ న‌లుగురు డెమొక్రాటిక్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వారే. ఈ ఏడాది ప్రారంభం నుంచి జ‌రుగుతున్న ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో దాదాపు 20 మందికి పైగా భార‌త‌సంత‌తికి చెందిన అమెరిక‌న్లు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌గా.. పెద్ద ఎత్తున సానుకూల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. మ‌రి.. సాధార‌ణ ఎన్నిక‌ల్లో వీరి జోరు ఎలా ఉంటుందో చూడాలి.