Begin typing your search above and press return to search.

3 వేలమంది కరోనా పేషేంట్స్ జనాల్లో కలిసిపోయారట !

By:  Tupaki Desk   |   4 July 2020 1:30 PM GMT
3 వేలమంది కరోనా పేషేంట్స్ జనాల్లో కలిసిపోయారట !
X
తెలంగాణలో పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీనితో ఈ మహమ్మారిని ఎలా కట్టడి చేయాలో తెలియక అయోమయంలో ఉన్న ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ప్రస్తుతం కరోనా‌ పరీక్షల కోసం ప్రైవేట్‌ ల్యాబ్‌ లకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత పది రోజులుగా కరోనా పాజిటివ్‌ వచ్చిన 3 వేల మంది రోగుల వివరాలను ప్రైవేట్‌ ల్యాబ్‌ లు ప్రభుత్వానికి నివేదించలేదని తెలుస్తుంది. కరోనా పరీక్షలు చేసిన తరువాత పాజిటివ్ వచ్చిన 3 వేలమందిని గాలికివదిలేసినట్టు ప్రసారమాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ... ప్రస్తుతం వీరికి సంబంధించిన 6వేల ప్రైమరీ కాంటక్ట్‌ల గురించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదు. దీనితో వారిని ఎలా గుర్తించాలో తెలియక అధికారులు టెంక్షన్ పడుతున్నారు. దీని పై పూర్తి వివరాలు చూస్తే .. ప్రైవేట్‌ ల్యాబ్‌ లలో పరీక్షలకు అనుమతిచ్చిన తరువాత తెలంగాణలో కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. దాంతో అధికారులు ప్రైవేట్‌ ల్యాబ్‌ల మీద పరిశోధన చేయడంతో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 3వేలకు పైగా పాజిటివ్‌ కేసుల గురించి ప్రైవేట్‌ ల్యాబ్‌ లు రాష్ట్ర ఆరోగ్య శాఖకు కానీ ఐసీఎంఆర్‌ కు కానీ నివేదించలేదని తెలిసింది.

కరోనా రోగులను టెస్ట్‌ చేయడం, గుర్తించడం, చికిత్స చేయడం వంటి అంశాల గురించి ప్రైవేట్‌ ఆస్పత్రులకు సరిగా తెలియకపోవడం వల్లే ఈ తప్పిదం జరిగినట్లు అధికారులు చెప్పారు. సాధారణంగా ప్రతి రోజు జరిపే వైరస్ నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలను పరీక్షాకేంద్రాలు ప్రభుత్వానికి, కోవిడ్‌-19 పోర్టల్ ‌కు అందజేస్తారు. అలా ఆ వ్యక్తికి ఒక యూనిక్‌ ఐడీ నంబర్‌ కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా ప్రభుత్వ ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌ సదరు పేషెంట్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ ను ట్రేస్‌ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఉద్యోగుల బృందం పని చేస్తోంది.

కానీ , ప్రైవేట్‌ ల్యాబ్ ‌లు కరోనా టెస్ట్‌ లు చేయడం కోసం వచ్చిన వారి దగ్గర నుంచి 3-6వేల రూపాయలు వసూలు చేశాయి. రిపోర్టులు ఇచ్చిన తర్వాత రోగులను గాలికి వదిలేసారు. ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేయలేదు. దీనితో దాదాపుగా పాజిటివ్‌ వచ్చిన 3 వేలమంది సామాన్య జనాల్లో కలిసిపోయారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ప్రజలు ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. అధికారులు దీనిపై స్పందిస్తూ.. బాధ్యతారహితంగా ప్రవర్తించిన ప్రైవేట్‌ ల్యాబ్‌ ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని , ఇప్పటికే ఆ ప్రైవేట్ లాబ్స్ కి నోటీసులు జారీచేసినట్టు తెలిపారు. అయితే , ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వారిని వారి ప్రైమరీ కాంటాక్ట్‌ లను గుర్తించడం అధికారులకి ఓ పెద్ద సవాల్ అని చెప్పవచ్చు.