Begin typing your search above and press return to search.

3 సార్లు ఎమ్మెల్యే..దళితుడినని అవమానించారు..

By:  Tupaki Desk   |   3 Oct 2019 6:27 AM GMT
3 సార్లు ఎమ్మెల్యే..దళితుడినని అవమానించారు..
X
మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యే రజినీ తనను రాజకీయాల్లో ఇబ్బందులు పెడుతున్న సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మరిచిపోకముందే మరో వైసీపీ ఎమ్మెల్యే తన అసంతృప్తిని, అసమ్మతిని వెళ్లగక్కాడు. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా దళితుడినని హేళన చేస్తున్నారని.. అవమానిస్తున్నారని వాపోయారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

ఇప్పటికీ సమాజంలో దళితుల పట్ల అంటరానితనం, కులవివక్ష కొనసాగుతోందని.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనపై కూడా వివక్ష చూపుతున్నారని.. దళితుడనే అక్కసుతో కొందరు హేళనగా.. చులకనగా మాట్లాడారని వాపోయారు. అందుకే అభివృద్ధి సాధ్యపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు సార్లు ఎమ్మెల్యే అయిన తనను తొక్కాలని కొందరు చూస్తున్నారని.. ఇంత ప్రజాస్వామ్య దేశంలో 73 ఏళ్లు గడిచినా ఇంకా అంటరానితనం.. వివక్ష దళితులపై పోవడం లేదని.. తనపైనే ఇంతలా ఉంటే సామాన్య దళితుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఇక వేదికపై కూడా ఓ పెద్ద ఫొటో పక్కన తన చిన్న ఫొటో పెడుతున్నారని ఎమ్మెల్యే బాబూరావు అసంతృప్తి వెళ్లగక్కారు. ఇది వివక్ష కాదా అంటూ సొంత పార్టీ నేతలనే ప్రశ్నించారు. గొల్ల బాబూరావు వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమవుతున్నాయి.