Begin typing your search above and press return to search.

30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీః మౌనంగా వెన‌క సీట్లో కూర్చున్నారు!

By:  Tupaki Desk   |   30 April 2021 2:30 AM GMT
30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీః మౌనంగా వెన‌క సీట్లో కూర్చున్నారు!
X
ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలను తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాలుగా శాసించార‌ని చెప్పొచ్చు. టీడీపీలో ఉన్నంత కాలం తిరుగులేని నాయ‌కుడిగా ఉన్నారు. టీఆర్ఎస్ లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా మంత్రిగా హ‌వా కొన‌సాగించారు. అయితే.. 2018 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత మొత్తం త‌ల‌కిందులైంది. ఇప్పుడు ఆయ‌న ఓ సీనియ‌ర్ నేత‌గా మాత్ర‌మే క‌నిపిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

టీఆర్ఎస్ లోకి రావ‌డ‌మే మంత్రి ప‌ద‌వి హామీతో వ‌చ్చారు. అన్న‌ట్టుగానే రోడ్లు భ‌వ‌నాల శాఖను క‌ట్ట‌బెట్టారు కేసీఆర్‌. ఆ త‌ర్వాత పాలేరు ఉప ఎన్నిక‌లో నిల‌బ‌డి గెలిచారు. దీంతో.. కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేంత వ‌ర‌కూ దూకుడు కొన‌సాగించారు తుమ్మ‌ల‌. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్రం మొత్తం కారు జోరు కొన‌సాగినా.. ఖ‌మ్మంలో మాత్రం పంక్ఛ‌రైపోయింది. ప‌ది ఎమ్మెల్యే స్థానాల‌కు ఒకే ఒక్క సీటు గెలిచింది టీఆర్ఎస్‌. మంత్రిగా ఉన్న తుమ్మ‌ల ఓట‌మి పాల‌య్యారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే అజ‌య్ కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది.

దీంతో.. తుమ్మ‌ల ప్రాభ‌వం వేగంగా ప‌డిపోతూ వ‌చ్చింది. మంత్రిగా అజ‌య్‌.. చ‌క్రం తిప్పుతూ.. ఇత‌ర గ్రూపుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతూ వ‌చ్చింది. జిల్లాలో.. అజ‌య్‌, తుమ్మ‌ల‌, నామ నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వ‌ర్గాలు బ‌లంగా ఉన్నాయి. వీరిలో.. మంత్రిగా అజ‌య్‌, ఎంపీగా నామా హ‌వా కొన‌సాగుతుండ‌గా.. తుమ్మ‌ల‌, పొంగులేటి వ‌ర్గాలు డీలా ప‌డిపోయాయి.

జిల్లాలో క్షేత్ర‌స్థాయిలో తుమ్మ‌ల‌కు మంచి ప‌ట్టు ఉంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. కానీ.. ఎంత ప‌ట్టున్నా.. అధికారం చేతిలో ఉండాల్సిందే. అప్పుడే.. నాయ‌కులు, జ‌నం వెంట ఉంటారు. అవేవీ లేక‌పోతే.. ఒంట‌రిగా మిగిలిపోవాల్సిందే. గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేళ అన్నీతానై వ్య‌వ‌హ‌రించి, త‌న‌వారికి టిక్కెట్లు ఇప్పించుకున్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. ఇప్పుడు అజ‌య్ కారు న‌డిపిస్తుంటే.. మౌనంగా వెన‌క సీట్లో కూర్చొని చూస్తూ ఉండాల్సిన ప‌రిస్థితి! దీంతో.. తుమ్మ‌ల చ‌క్రం ఎప్పుడు తిరుగుతుందో? మ‌ళ్లీ డ్రైవింగ్ సీట్లోకి ఎప్పుడు వ‌స్తారో? అని ఎదురు చూస్తున్నారు ఆయ‌న గ్రూపు స‌భ్యులు.