Begin typing your search above and press return to search.

రాజధానిలో న్యాయానికి 3000 ఎకరాలు

By:  Tupaki Desk   |   16 Dec 2015 5:03 PM GMT
రాజధానిలో న్యాయానికి 3000 ఎకరాలు
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో న్యాయ వ్యవస్థకు ఏకంగా 3000 ఎకరాలను కేటాయిస్తున్నారు. జస్టిస్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థకు పెద్దపీట వేశారు. న్యాయమూర్తులకు బంజారాహిల్స్ - జూబ్లీహిల్స్ ల్లో స్థలాలు కేటాయించారు. ఇప్పుడు నవ్యాంధ్రలో కూడా వారికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు.

రాజధాని ప్రాంతంలోని నేలపాడు - శాఖమూరు గ్రామాల మధ్యలో జస్టిస్ సిటీ రానుంది. ఇక్కడే హైకోర్టును నిర్మించనున్నారు. ఇక్కడికి సమీపంలోనే న్యాయమూర్తుల ఇళ్లు - క్వార్టర్లు రానున్నాయి. వీటికి అదనంగా ఇక్కడే నల్సార్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు - క్వార్టర్లు - రిజిస్ట్రార్ కార్యాలయాలు - జాతీయ మానవ హక్కలు కమిషన్ - నల్సార్ యూనివర్సిటీ వంటి న్యాయ వ్యవస్థ - దానికి అనుబంధంగా ఉండే అన్ని శాఖల భవన నిర్మాణాలకు కలిపి 3000 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యధిక భాగం నల్సార్ యూనివర్సిటీకే వెళుతుందని భావిస్తున్నారు.

హైదరాబాద్ లో కానీ మరే ఇతర రాజధానిలో కానీ హైకోర్టు ఒకచోట ఉంటే.. మానవ హక్కుల కమిషన్ మరొక చోట ఉంటుంది. లోకాయుక్త ఇంకొకచోట ఉంటుంది. ఏసీబీ కోర్టులు ఒకచోట ఉంటే సివిల్ కోర్టులు మరొకచోట ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో ఏసీబీ కోర్టులు నాంపల్లిలో ఉంటే సివిల్ - ఇతర కోర్టులు అఫ్జల్ గంజ్ లో ఉన్నాయి. దాంతో న్యాయమూర్తులు - న్యాయవాదులు - కక్షిదారులకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ అమరావతిలో ఈ ఇబ్బందులు ఉండవు. ఏసీబీ.. సివిల్ - క్రిమినల్.. అది ఏ రకమైన కోర్టు అయినా అన్ని కోర్టులూ జస్టిస్ సిటీలోనే ఉండనున్నాయి. అవి కూడా నిర్దిష్ట పరిధిలోనే ఉండనున్నాయి.